ఆఫీసు నుంచి రావడం కాస్త ఆలస్యమైంది.డోర్‌ బెల్‌ కొట్టాను. తెరచుకోలేదు.కాసేపాగి మళ్ళీ కొట్టాను. ఉహు!...తెరచుకోలేదు.ఠక్కున గుర్తుకొచ్చింది.ఆరోజు శనివారం. వసంతనగర్‌లో సంత. నా శ్రీమతి సంతకు వెళ్ళి ఉంటుందనుకున్నాను. అయినా పెందరాళే వెళ్ళి జెమినీ టీవీలో సీరియల్స్‌ ఆరంభానికి ముందే వచ్చి ఉండాలి. పొరబాటున మిస్సైన ఎపిసోడ్‌ను తిరిగి మినీపాడ్‌లో చూస్తేగాని ప్రశాంతంగా నిద్రపోదు. అలాంటి సుమతి సంతకెళ్ళి ఇంకా రాకపోవడమా?

నా మనసు ఏదో కీడు శంకించింది.ఛీ ఛీ! ప్రతీ చిన్న విషయానికి ఇంతగా ఆందోళనపడితే ఎలా! అని నా మనసుకు నేనే సర్దిచెప్పుకున్నాను. అయినా నా మనసు కుదుటపడ్డం లేదు.ఈ అలవాటు నాకు బాల్యంనుంచీ ఉంది. ఎదుటివారి బాధచూసి తట్టుకోలేను. గిలగిలలాడిపోతాను. నాటకాలలోగానీ, సినిమాలలోగానీ ఒకరినొకరు కొట్టుకున్నా, చంపుకున్నా ఆ దృశ్యాలు చూసి బిగ్గరగా ఏడ్చేవాణ్ణి. నా ఏడ్పులు పెడబొబ్బలు చూసి పక్కనున్న ప్రేక్షకులు నన్ను సముదాయించేవారు.ఒకసారి ఒక నాటకంలో ఒకడు చనిపోయిన సంఘటన తరువాత, నన్ను తెరవెనుకకు తీసుకెళ్ళి చనిపోయిన వ్యక్తిని చూపించాడు మా నాన్న. అతడు ‘‘బాబూ! అంతా ఉత్తినే, ళో..ళో....ళో...నేను చావలేదు చూడు’’ అంటూ మూతి సున్నాలాచుట్టి నన్ను ముద్దాడ వస్తుంటే నేను భయంతో కంపించిపోయి నాన్న వెనకాల దాక్కున్నాను.

వీధుల్లో ఎవరైనా కొట్టుకున్నా, తిట్టుకున్నా నేను భరించలేకపోయేవాణ్ణి. నేనూ వారితోబాటు ఏడ్చేవాణ్ణి. నన్నుచూసి మా ఇంట్లోనూ మా అమ్మ నవ్వుతూ, ‘‘మా నాయనే! నీది ఎంత జాలిగుండెరా బాబూ!!’’ అని ముసిముసి నవ్వులు నవ్వతూ తన హృదయానికి హత్తుకునేది.‘‘వయసు పెరిగినకొద్దీ భయం దానంతట అదే తగ్గిపోతుందిలే’’ అంటూ నాన్న సర్ది చెప్పేవాడు.