అర్ధ్దరాత్రి.ఎందుకైనా మంచిదని బయట వసారాలో లైట్‌ ఆఫ్‌ చేసింది ప్యారీ. తలుపుకు గడియ మాత్రం తీసేఉంచింది. అతను ఎప్పుడైనా రావొచ్చు. అప్పటికే నేలమీద పర్చి ఉన్న బొంత మీద పడుకుంది ప్యారీ. పక్కనే తన ఏడేళ్ల కూతురు సోని గురకపెడుతోంది.

తన దగ్గరున్న సెల్‌ఫోన్‌లో లైటు వేసి చూసింది. కూతురిది గుండ్రటి ముఖం. లావు లావు బుగ్గలు. తన మాదిరే. ఎవరో పెద్దమనిషి పడుకున్నట్టు పడుకుని ఉంది. అటు తిరిగి తన రెండు బుల్లి చేతుల్ని తలకింద పెట్టుకుంది. ఎంత బాధలో ఉన్నా కూతురి ముఖం ఒకసారి చూస్తే ఆమెకు సంతోషం.తర్వాత సెల్‌ ఫోన్‌ లైటు ఆఫ్‌చేసి చీకట్లోనే తలుపు వైపు దృష్టి సారించింది. బయట ఎవరైనా వస్తున్న చప్పుడు అవుతుందేమో అని చెవులు రిక్కించింది. తన పెంకుటిల్లున్న సందులోకి ఆ సమయంలో ఎవరైన మనిషి వస్తున్న చప్పుడైతే అది అతనే అని ఆమె సులభంగానే గుర్తుపడుతుంది. ఎందుకంటే ఆ సందులో ఉన్నది తన ఇల్లు ఒక్కటే.ఇది అలవాటే అయినా ఈసారి ఎందుకో ఆమెకు భయంగా ఉంది. మొన్న వినాయకుడి మండపం దగ్గర జరిగిన గొడవే ఇందుకు కారణం. గల్లీలో ఎంతమంది ముస్లిములు ఉన్నారో అంతమంది హిందువులూ ఉన్నారు.

ఏదో చెప్పాలి కాబట్టి ముస్లిములు, హిందువులు అని విడదీసి మాట్లాడుతారు కానీ ఆ మనుషుల్లో మాత్రం అలాంటి స్పృహ ఏమీ లేదు. అంతా కలగలిసే ఉంటారు.ఏటా పెడుతున్నట్టే ఈసారి కూడా వీధిలో వినాయక మండపం పెట్టారు. అంతకుముందు గల్లీలో మసీదు ఉండేది కాదు. ఎమ్మెల్యే వీరప్పతో చనువుగా ఉండే మౌలాలికి ఏం తేలు కుట్టిందో కానీ వీధిచివర తనకున్న నాలుగున్నర సెంట్ల భూమిని మసీదు కట్టుబడికి రాసిస్తున్నానని ప్రకటించడమే కాకుండా, దగ్గరుండి మసీదు కట్టించేసి వీధిలో ఒక వర్గానికి ఆరాధ్యుడై పోయాడు. తర్వాత తెలిసిందేంటంటే వచ్చే కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆ డివిజన్‌కు కార్పొరేటర్‌గా పోటీ చేయాలని అతని ఆలోచనంట! ఎన్నికల్లో పోటీ చేయాలంటే నలుగురికీ మేలు చేయాలి కానీ మసీదు కట్టడమేంటి? అని అతన్నెవరూ అడగలేదు. అతనంటే భయమో, దేవుడంటే భయమో తెలియదు.