‘‘రైతు ఆకాశం వంక ఆశగా చూస్తున్నాడు’’ అన్నాడు మధు.‘‘ఆఁ....!? పంట బాగా పండిందా లేదాని నేలవంక కదా చూస్తాడు?’’ అంది అభయ అర్థం కాక.‘‘ఉదయం ఆరింటికే చురుకైన కిరణాలచెప్పులు ధరించి, కణకణమండే నిప్పుల కొరడా చేత బట్టుకుని ఆబగా, ఆత్రంగా బయలుదేరాడు వేసవి సూర్యుడు’’ అన్నాడు మళ్ళీ.

‘‘ఇదేం పోలిక?’’‘‘ఆ ఎండకు రోడ్డుమీద అడుక్కుతినే బిక్షగత్తె మొదలుకుని, వైట్‌కాలర్‌ ఉద్యోగాలంటూ ఆఫీసుల్లో ఏ.సీల ముందు ఉండి బయటకొచ్చి చెమటలు కక్కి బ్లాక్‌ కాలర్లతో ఇల్లు చేరిన వాళ్ళ వరకూ అందరూ తలెత్తి ఆశగా ఆకాశం వంకే చూస్తున్నారు’’ మళ్ళీ అన్నాడు మధు.‘‘ఓ మైగాడ్‌! అంతా తలెత్తి ఏం చూస్తున్నారు బాబూ? అక్కడ ఆకాశంలో అంత విచిత్రం ఏం ఉందట?’’ విసుగ్గా అంది అభయ.‘‘వర్షం తల్లీ!’’‘‘వదినా... యు ఆర్‌ ఆబ్జల్యూట్‌లీ...హండ్రెడ్‌ పర్సెంట్‌ కరెక్ట్‌’’ అంటూ కాఫీ కప్పులు పట్టుకొచ్చిన వదిన ఉదయతో అన్నాడు మధు.‘‘అక్కా, మీ మరిదిగారికి మతిగానీ పోయిందేమోనని నా అనుమానం.

అరగంటనుంచీ నా బుర్రని ఐస్‌క్రీమ్‌లా తినేస్తున్నాడు’’ కాఫీ కప్పు అందుకుంటూ అంది అభయ.‘‘ఏమిటి మధూ, నీపైన ఈ కంప్లెయింట్‌? అవునూ, ఇంతకీ ఏది కరెక్ట్‌?’’ అడిగింది ఉదయ ఓ కప్పు మధుకిచ్చి తనూ కప్పు తీసుకుని సోఫాలో కూర్చుంటూ.‘‘ఆఁ, అదే వదినా నువ్వెప్పుడూ అనేదానివిగా? మా చెల్లెలు అరటిపండు వలిచిపెట్టినట్టుతప్ప, ఇంకెలా చెప్పినా అస్సలు తెలుసుకోలేదు. వట్టి ట్యూబ్‌లైట్‌, బుద్ధావతారం, ముద్ద పప్పు... ఇంకా ఏదో ఉండాలి. గుర్తురావట్లేదే! అదీ..’’ కావాలనే అన్నాడు మధు కాఫీ సిప్‌ చేస్తూ.‘‘అక్కా....!’’ అని గట్టిగా అరిచింది అభయ.