‘పెళ్లికి ముందు నేనో అమ్మాయిని ప్రేమించాను. నన్ను మోసం చేసి అమెరికా సంబంధం అని వేరొకరిని పెళ్లి చేసుకుంది.. ఆమె జ్ఞాపకాలను చెరిపేశాను కానీ.. ఇంకా అక్కడక్కడా మరకలున్నాయి.. నీకు ఏ లోటూ రానివ్వను.. కానీ నేను నీవాడిగా మారేందుకు కొంతకాలం పడుతుంది..’ అని శోభనం రోజే ఆ భార్యతో తేల్చిచెప్పాడా భర్త.. ఏడాది గడిచింది.. సరిగ్గా ఏడాది తర్వాత తన మాజీ ప్రేయసి అతడిని వెతుక్కుంటూ ఇంటికే వచ్చేసింది.. చివరకు ఏం జరిగిందంటే...
********************

‘తేరే బినా, హమే జీ నహి సకిలే, తేరే బనా క్యా వజాద్‌ మేరా....’‘నీవు లేకుండా బతకలేను. నీవు లేకపోతే నా ఉనికేముంది..’నా ప్రేమా నీవే, నా విరహానివీ నీవే,నా బాధా నీవే, నా ఓదార్పువీ నీవే...’ఎంత అద్భుతమైన ఆవేదన దాగి ఉంది ఆ వాక్యాలలో.ఆ గొంతులో ఎంత విరహం, వేదన దాగుంది. ప్రేమ, విరహం, బాధ...ప్రేమ ఎంతమధురం..ప్రియురాలు అంతకఠినం...ఎందరో కవులు ఎంత గొప్ప విరహబాధ వ్యక్త పరిచారు. వీధివైపు బాల్కనీలో చీకటిమాటున పేం కుర్చీలో కూర్చుని, పక్కన మంద్రస్థాయిలో టు ఇన్‌వన్‌ మధురగీతం ఆలపిస్తుంటే..బయటపడుతున్న తుంపర, తనతోపాటు చల్లని పిల్లతెమ్మరనీ తెచ్చి పన్నీరు చిలకరించినట్టు చిరుజల్లు మండుతున్న మనసుని ఓదారుస్తున్నట్టు చల్లగా తాకుతూ పులకరింపజేస్తూ... వీధి లైట్ల వెలుగులో కరెంటు తీగలనుంచి ఒక్కో నీటి బొట్టు, జారుతూ పుడమితల్లి దారంలో ముత్యాలు గుచ్చుకుంటున్నట్టు నీటి వెలుగుపడి మెరిసే నీటి ముత్యాలు...తలంటి పోసుకుని కురులు ఆరబెట్టుకుంటున్నట్టు గాలికి చిరురెమ్మలు ఊగుతూ, ఒంటిని మురికి వదుల్చుకున్నట్టు నవనవలాడే ఆకులు, రాలిపోతాయేమోనన్నట్టు బెంగగా తలలు వాల్చిన మందారాలు.

నందివర్ధనాలు, సగం రాలిన రేకులను చూసి కన్నీటిబొట్లు రాలుస్తున్నట్టు గులాబినుంచి జారిపడే నీటిబొట్లు...‘చీకటిలో ప్రకృతి అందాలు చూపెడుతున్నా చూడండి...’ అని వెలుగులు చిమ్మే మెరుపులు, ఆ వాతావరణం...ఓహ్‌ చూడగలిగిన మనసుంటే ప్రకృతి ఎన్నెన్ని అందాలు చూపెట్టి పరవశింపజేస్తుందో. ఆ అందాలకి కరిగిపోయి పరవశించే మనసుని ఆ విరహగీతం..మనసును తట్టి, కుదిపి లేపి, ఎన్నెన్ని జ్ఞాపకాలను కళ్ళముందుపరచి, మూగబోయిన మనసు ద్రవించి కళ్ళముందు పలచటి నీటిపొర... ఆ తెరలోంచి ముగ్ధమనోహర రూపం నవ్వుతూ చేతులు చాచి పిలుస్తుంటే, వివశుడై అందుకోవాలని ఆరాటంగా చేతులు చాచి ముందుకు వెడుతుంటే, ఊరిస్తూ, వెనక్కి వెనక్కి అడుగులు వేస్తూ, నన్నందుకోలేవు, దొరకను నీకు అన్నట్టు మరింత వెనక్కి వెళ్లి, మాయమై, రిక్తహస్తాలతో నిలబెట్టి...అందకుండా వెళ్లిపోయింది.

ఎటువెళ్లిందో తెలుసు, ఎక్కడుందో తెలుసు, కాని తాను చేరుకోలేని అగాధం మధ్య సృష్టించి వెళ్లిపోయింది. ఊరించి, మురిపించి, ఓలలాడించి, తనవితీరా కరిగిపోదామనుకునే వేళకి, కబురైనా చెప్పకుండా తన తప్పేమిటో కూడా తెలియనంత అయోమయంలో పడేసి మాయమైంది. కలేమోనన్న భ్రమలో కొన్నాళ్లు..తిరిగి వస్తుందేమోనన్న ఆశ కొన్నాళ్ళు..వస్తే ఎంత బాగుండునో అనే కోరిక, ఇంకరాదన్న నిరాశ మిగిల్చిన జ్ఞాపకాలవేదన, విరహంతో కొన్నాళ్ళు, మనసు దిటవుపరుచుకోడానికి ప్రయత్నిస్తూ కొన్నాళ్లు...ఆవేదనలోంచి పుట్టినబ కసి, కోపం, ఎవరిమీదా చూపించలేక తననితాను శిక్షించుకుంటూ... గుండెచెదరి, మనసు పరితపిస్తూ బతుకుమీద నిరాసక్తతతో, ‘ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం...’ అంత గొప్పగా చెప్పిన వాక్యాలు తన కోసమే రాశారేమో ఇలాంటి రాత్రులు ఎన్నెన్ని అందాలు, ఆనందాలు, అనుభూతులు, పరవశాలు, మైమరపులు, వెన్నెలరాత్రులు, వర్షపురాత్రుళ్లు ఈ బాల్కనీలో... జీవితం ఇంత అందంగా ఉంటుందా అనిపించిన క్షణాలన్నీ మూటగట్టి తీసుకెళ్లి, తనకేం మిగల్చకుండా దగాచేసిపోయింది.