ఈమధ్యే పెళ్ళయిందతడికి. ఆఫీసులో ఉన్నా ఇంటిమీదే ధ్యాస. కానీ అంతలో అటెండర్‌ వచ్చి, ఎవరో రిసెప్షన్‌లో ఈ ఉత్తరం ఇచ్చి వెళ్ళారన్నాడు. తెరచిచూస్తే ఒకప్పటి ప్రియురాలు! సాయంత్రం పార్కు దగ్గరకు రమ్మని రాసింది! వెళ్ళాడతను. మెడలో నల్లపూసలు! చేతులకు నిండుగా గాజులు, నిమ్మపండుచీరలో మెరుపుతీగలా ఉందామె! భుజాలు రాసుకుంటూ ఓ సిమెంటు బెంచిమీద కూర్చున్నారు. ఏమిటి వాళ్ళ వింత ప్రవర్తన? వాళ్ళమధ్య బంధం ఎలాంటిది?…

నా ఉద్యోగం ఒక ప్రభుత్వేతరసంస్థలో.వేతనం భారీగానే ముట్టచెబుతున్నారు. పనికూడా దానికి తగ్గట్టే పిండుకుంటారు. ఆ అపరాహ్నవేళ ఎంతో పనిఒత్తిడిలో ఉన్నప్పటికీ పదే పదే గోడగడియారంవైపే చూడసాగాను.ఎప్పుడు సాయంత్రం అవుతుందా, ఎప్పుడెప్పుడు ఇంటికి జారుకుంటానా అని ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే నాకీమధ్యనే వివాహమైంది.

నా భార్య వెన్నెల. పేరుకు తగ్గట్టే వెన్నెల, ఆమె మనసు వెన్నెల, మాట వెన్నెల, చేత వెన్నెల. ఆమె వచ్చాక నా జీవితం పండువెన్నెలలా ఉంది.ఒయ్యారంగా ముందుకు వాలుతున్న వాలుజడతో వచ్చి నాకు కాఫీ కప్పు అందిస్తుంటే...! ఆ మధురక్షణం కోసమే నా ఎదురుచూపులు. అధరాలతో కాఫీని గ్రోలుతూనే, సాంద్రమైన కాటుక పూతతో కమనీయంగా ఉన్న ఆ సోగకన్నులోని సౌందర్యాన్ని నయనాలతో ఆస్వాదించే ఆ మహత్తరక్షణంకోసం లేలేత సూర్యుని వెచ్చదనం వంటి ఆమె పరిష్వంగంలో లభించే తాదాత్యం కోసం తనువు తహతహలాడుతున్నది. చిత్తము చిందులు వేస్తు్న్నది.మా సంస్థలో అన్యులకు ప్రవేశం నిషిద్ధం కావటంచేత సెక్యూరిటీ సిబ్బంది ఒకరు నా వద్దకు వచ్చి ‘ఒక మేడమ్‌ మీకీ ఉత్తరం ఇమ్మన్నారు’ అంటూ నా చేతికి లేత గులాబీరంగులో ముద్దులొలుకుతున్న లేఖను అందించి నిష్ర్కమించాడు. దానిని చూడటంతోనే నా మనసున మల్లెలమాలలూగాయి. ఉత్తరాన్ని తెరవక మునుపే అందులోనుంచి స్నేహ పరిమళం గుప్పుమన్నది. అది నా ప్రియురాలు రాసిన ప్రేమలేఖ! ఎంతకాలమైంది. ఆమెనుంచి ప్రేమలేఖ అందుకుని? సెల్‌ఫోన్‌తో నిమిత్తంలేకుండా మా నడుమ ఇటువంటి ప్రేమలేఖలు ఎన్నెన్ని బట్వాడా అయ్యేవి! చాలాకాలం తరువాత, అదీ వివాహమయ్యాక ఇప్పుడు..ఇంత కాలానికి..తనువూ మనసూ పులకిస్తుండగా ఎంతో ఆత్రుంగా చదివాను..