‘‘నాన్నా నేను ఇండియా వస్తాను. ఎప్పుడు రమ్మంటావ్‌?’’‘‘నీ ఇష్టం ఎప్పుడైనా రావొచ్చు. ఏంటి విషయం?’’‘‘నీతో మాట్లాడాలి!’’‘‘దానిదేముంది, ఫోన్లోనో, స్కైప్‌లోనో మాట్లాడటం కుదరదా?’’‘‘ఎలా కుదురుతుంది. వచ్చిన తర్వాత చెబుతా, అప్పుడు డిస్కస్‌ చేద్దాం!’’‘‘స్కైప్‌లో పూజలేంటి? పెళ్ళిళ్ళు కూడా జరిగిపోతున్నాయి. నీది అంతకంటె స్పెషలా?’’

‘‘వచ్చేనెల మూడవతేదీన వస్తాను నాన్నా, సరేనా!’’‘‘వెల్‌కమ్‌. ఒక్కడివేనా?’’‘‘అవును. వాళ్ళ అవసరం లేదు. నువ్వూ నేనూ మాట్లాడుకుంటే చాలు!’’ఇది ఓ తండ్రీకొడుకుల సంభాషణ. తండ్రి రవీందర్‌రావు రిటైర్డ్‌ హెడ్‌మాస్టర్‌. హైదరాబాద్‌లో నివాసం. కొడుకు సురేష్‌కుమార్‌ అమెరికా లాస్‌ఏంజిల్స్‌లో ఒక సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి వైస్‌–ప్రెసిడెంట్‌.‘మూడేళ్ళక్రితంవరకు ప్రతిసంవత్సరం అమ్మానాన్నలను చూడటానికి హైదరాబాద్‌ వచ్చేవాడు తను. ట్రాఫిక్‌భయంతో కారులో కళ్ళప్పగించి చూస్తూ కూర్చుండిపోయేవాడు. కారులో కూర్చున్నంతసేపు టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరై సతమతమయ్యేవాడు. అక్కడ ఉన్నన్ని రోజులూ అమ్మచేతివంట ఇష్టంగాతింటూ అందరితోకలిసి బోలెడు సినిమాలు చూసేవాడు. భార్యాపిల్లవాడితో కలిసి ఆ జ్ఞాపకాలన్నీ పదిలపరచుకుని వాటిని అమెరికాలో అందరికీ చేరవేసేవాడు. అందరితో సరదాగా గడిపిన జ్ఞాపకాలు బాగా గుర్తుచేసుకునేవాడు.

ఆ పదిహేనురోజులూ అమ్మ ఎంత ఆనందంగా గడిపేదో. ముఖ్యంగా తనకొడుకు రాహుల్‌ అంటే అమ్మకు ఎంత ప్రేమ! బహుశా తప చిన్నతనాన్ని మనవడిలో చూసుకుని మురిసిపోయేదేమో అమ్మ’ అనుకునేవాడు సురేష్‌.అమ్మకాలంచేసి మూడేళ్ళైంది. ఆ సమయంలో నాన్న ఫోన్‌చేయగానే ఏమాత్రం ఆలస్యంచేయకుండా అమెరికానుంచి హైదరాబాద్‌ చేరుకున్నాడు సురేష్‌కుమార్‌. అమ్మకు మామూలుసుస్తీ అనుకున్నారు. లంగ్‌ ఇన్‌ఫెక్షన్‌. ఫర్వాలేదుకానీ...అంటూనే మైల్డ్‌ హార్ట్‌ఎటాక్‌ వచ్చిందని స్టంట్‌ వేశారు డాక్టర్లు.

డిశ్చార్జ్‌ చేస్తారనుకుంటుండగానే ఓ ఉదయం సురేష్‌ని పిలిచి ‘‘క్రిటికల్‌గా ఉంది. సర్వైవల్‌ ఛాన్సెస్‌ చాలా తక్కువ’’ అని చెప్పారు డాక్టర్లు. సురేష్‌ షాక్‌ తిన్నాడు. ఏమీ అర్థంకానిస్థితిలో అయోమయంగా అక్కడున్నబల్లమీద కూర్చున్నాడు. వెంటనేలేచి తండ్రివద్దకు వెళ్ళాడు. పెదవి కదపలేక వణుకుతున్న చేతులతో తండ్రిని పట్టుకున్నాడు. రవీందర్‌రావు బల్లమీద కూలబడి రెప్పవేయకుండా కొడుకువైపే బ్లాంక్‌గా చూస్తున్నాడు! ఇన్నేళ్ళ ఆయన అనుభవం మరుగునపడి ఆయనకళ్ళల్లో నీళ్ళు సుళ్ళు తిరుగుతున్నాయి.