అతడు ఆమె వెంట పడ్డాడు. గాఢంగా ప్రేమించాడు. మెప్పించాడు. ఒప్పించాడు. పెద్దలను ఎదిరించి పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు బిడ్డలకు తండ్రయ్యాడు. హాయిగా జీవితం గడుస్తోంది. ఇంతకన్నా ఇంకేం కావాలని మురిసిపోతున్న దశలో అతడికి ప్రమోషన్‌ వచ్చింది. ఎంతో సంతోషంతో ఆ విషయమే భార్యకు చెప్పాడు. కానీ ఆ మర్నాడే అతడు ఆత్మహత్య చేసుకున్నాడు! ఎందుకు? ఎందుకలా? అతడి మరణం వెనుకున్న మిస్టరీ ఏంటి?..

హేమలత పక్కకు ఒత్తిగిల్లింది. తన చేయిని విసిరేసినట్టుగా పక్కకు వేసింది. పక్కన ఎవ్వరూ లేరు. పదిరోజుల క్రితం దాకా నవీన్‌ తన పక్కనే ఉండేవాడు. ఇప్పుడు లేడు. లేడు అంటే ఎక్కడికైనా వెళ్ళాడా అంటే కాదు, అసలు ఈ లోకంలోనే లేడు. నమ్మలేకపోతోంది. పెళ్ళై పదేళ్ళు కావొస్తోంది. ఇద్దరు పిల్లలు. భార్యంటే ఇంట్లోనే ఉండాలన్నాడు. పిల్లల్ని చూసుకోవడమే తన బాధ్యత అన్నాడు. బయటకువెళ్ళి ఏమీ వెలగబెట్టక్కర్లేదు అన్నాడు. నవీన్‌ అన్న ఏ మాటా కాదనలేదు. మరి తనెందుకు కాదన్నాడు? తన జీవితానికి ఇంతటి సమస్య ఎందుకు వచ్చింది? ఈ సంఘటన తనకంటే తన కన్నవాళ్ళకు మరింత బాధ కలిగిస్తోంది. అసలు వాళ్ళ ఏడుపులతోనే తనకు మళ్ళీ మళ్ళీ జరిగినవన్నీ గుర్తుకువస్తున్నాయి.

‘‘అందుకే ప్రేమ వివాహాలు వద్దే అన్నాను. జాతకాలు చూద్దాం అన్నాను. వింటేగా! మనసులు కలిశాక ఇంకా జాతకాలు ఏంటమ్మా! అంది. ఇప్పుడు చూడు పసిపిల్లలతో ముందు ముందు దాని జీవితమంతా ఏమవ్వాలి?’’ అని ఏడుస్తూనే ఉంది. కన్నతల్లి కదా పాపం!‘అయినా నవీన్‌ తను ఒక్కడే వెళ్ళాడా? లేదే? తన మనసునీ, ఆత్మనీ, విశ్వాసాన్నీ, తన సర్వసాన్నీ తీసుకెళ్ళిపోయాడు. విధి వక్రించి తన జీవితం ఇలా అయిందా అంటే అదీ కాదు, తనంతట తనే జీవితమే వద్దనుకుని మరీ వెళ్ళిపోయాడు. అసలు నవీన్‌కు ఏమైంది? నిత్యం తనను అంటిపెట్టుకుని తిరిగేవాడే. ఏం తక్కువ చేశానని తనను వదిలి వెళ్ళిపోయాడు? అసలెందుకు వెళ్ళిపోయాడు? తనతో నూరేళ్ళ జీవితం గడపాలని అందర్నీ ఎదిరించి వచ్చిన తనని మధ్యలో వదిలేసి ఇలా వెళ్ళిపోవడం నమ్మకద్రోహం కాదా? తనతో చెప్పుకోలేని బాధలు నవీన్‌కు ఏమున్నాయి? అని తలుచుకుని కుమిలిపోయింది. ఒకలాంటి నిర్లిప్తత చోటుచేసుకుంది ఆమెలో. పక్కనే ఆదమరచి నిద్రపోతున్న పిల్లల్నిచూసి కన్నీరు మున్నీరైంది. నిద్రపోయేంతవరకే తన జీవితం. తెల్లారేసరికి ఎవరు ఉంటారో వారిదే కాలం అనిపించింది. ఏ రోజుకారోజు జీవితంలో మరో రోజు ఇచ్చినందుకు ఆ దేవుడికి ధన్యవాదాలు చెప్పుకోవడం తప్ప ఇంకేముంది? అదీకాక తెల్లవారితే ఇక్కడ ఈ వాతావరణమంతటా ఇవే మాటలు దొర్లుతూ ఉంటాయి. ఇక్కడే ఉంటే తనకు పిచ్చెక్కిపోవడం ఖాయం’ అనుకుంది హేమ. బయట మాటలు, ఏడుపులు వినిపించకుండా దుప్పటి పూర్తిగా కప్పేసుకుంది.