అమ్మ లేకపోతే ప్రేమ అనే పదం, ప్రేమ భావన పుట్టేదే కాదేమో! అందుకే అమ్మ ఒక ప్రేమమూర్తి. ప్రేమకు నిలయం. స్ర్తీని బేలగా వర్ణిస్తారుగానీ, ఆపద సమయంలో ఆ స్ర్తీయే అపరశక్తి స్వరూపిణిలా ధైర్యసాహసాలు ప్రదర్శిస్తుంది. అందుకే 70–80ఏ‍ళ్ళు వచ్చినా అమ్మ ఎంతో అపురూపమైనది. అనుభవాలకు, గతకాలపు చరిత్రకు గొప్ప సాక్షి. అందుకే అమ్మకు రేపంటూ ఉండాల్సిందే....

వేద కాలం నుంచి ఇప్పటిదాకా సూర్యుడి గురించి ఎన్నోకథలు రాశారు.కవులంతా చంద్రుడినే ఆధారం చేసుకుని ఎంతో కవిత్వం అల్లారు. పాటలు పాడారు. అందమైన ఆకాశం గురించి ఎన్నెన్నో వర్ణనలు.భూమి కథలూ ఎన్నెన్నో ఉన్నాయి. నేటి వెతలే ఆ కథలన్నీ. ఎడారిగాలుల నుంచి హిమాలయగాలుల చల్లదనంవరకు, శ్వాసలో ఆడే ప్రాణవాయువుమీద రక రకాల కథలు, ప్రకృతి మీద కథలు, భూమి పుత్రులమీద కథలు...అన్నీ బ్రతుకు చిత్రాల కథలే.ఎన్నెన్ని కథలో. వీటన్నింటిలోకీ, ఎంత రాసినా తరగనిది, అనంతమైనది అమృత తుల్యమైనది అమ్మకథ. ఆమె ఒడిలోనే అందరి బడీ ప్రారంభమవుతుంది. అమ్మప్రేమకు అంతులేదు. ఎంత చెప్పినా ఇంకా ఇంకా మిగిలిపోతూనే ఉంటుంది.

‘‘అమ్మని చూడ్డానికి నువ్వొస్తున్నావా?’’ తమ్ముడు వాసు ఫోను.వాడుంటున్నది వైజాగ్‌. నేనుంటున్నది హైదరాబాద్‌. మా అమ్మ ఇప్పుడున్నది విజయవాడ. వాడు అటునుంచి వస్తే, నేను ఇటునుంచి వెళ్లాలి. ఇద్దరం అమ్మ దగ్గర కలుసుకుంటాం. అమ్మ ప్రస్తుతం సుధ దగ్గర ఉంటోంది. సుధ నాకు చెల్లెలు. వాసుకి అక్క.అమ్మకు ఏడాదికాలంగా ఒంట్లో బావుండటం లేదు. డెబ్భై ఎనిమిదేళ్ళు. వయసు ప్రభావం. వైద్యపరీక్షలు, మందులు, మందులు వైద్యపరీక్షలు...నాన్న పోయాక అమ్మ ఆరోగ్యం బాగా దెబ్బతింది.సెలవుపెట్టి గుండె ఆపరేషను చేయించుకున్న తరువాత నాన్న పదిహేనేళ్ళు ఉద్యోగం చేశారు. నడుస్తూ, మాట్లాడుతూ మాట్లాడుతూనే ఒకరోజు ప్రాణం విడిచిపెట్టేశారు నాన్న. తట్టుకోలేకపోయింది అమ్మ. పదే పదే ఆ విషయమే చెబుతూ ఉండేది.‘‘ఆ రోజు నాకు బాగా గుర్తుంది. దేవుడి పూజకు పూలు, పళ్లు కొబ్బరికాయ తెచ్చుకున్నారు. చక్కగా పూజ చేశారు. బయటకువెళ్లారు. బజారునుంచి ఇంటికి కావల్సిన సామాన్లు తెచ్చారు. టీ.వీ.లో భక్తి సీరియల్ వస్తుంటే చూశారు. గుండె పట్టుకుంటోంది అని ఛాతీని రెండుసార్లు నిమురుకున్నారు. అది ఆయనకు అలవాటే. గ్యాస్‌ నొప్పికదా అని నేనూ పట్టించుకోకుండా ఊరుకున్నాను. చపాతి, పాలు ఇచ్చాను. సగం తిని సగం వదిలేశారు. రాత్రి ఏడవుతోంది. తన మంచం తనే వేసుకున్నారు.