నేను ఏలూరులో పోలీసు ఆఫీసర్‌గా ఉన్నప్పుడు చింతలపూడి క్యాంపు వెళ్ళాల్సివచ్చింది.సాయంత్రం పోలీసు పని ముగించుకుని తీరిగ్గా కాలక్షేపం చేస్తున్నప్పుడు ‘‘సార్‌ మిమ్మల్ని చూడాలని ఈ ఏరియా మేజిస్ట్రేట్‌ గారు వచ్చారు’’ అని మా కానిస్టేబుల్‌ అతి వినయంగా చెప్పాడు. మేజిస్ట్రేట్‌ న్యాయవ్యవస్థకు సంబంధించినవాడు కాబట్టి మా పోలీసువాడు వినయం ప్రదర్శిస్తున్నాడా, భయం ప్రదర్శిస్తున్నాడా నాకు ఆ క్షణాన అర్థం కాలేదు. సహజంగా క్యాంపులో ఉన్నప్పుడు అక్కడి అధికారులు మర్యాద పూర్వకంగా కలుస్తూనే ఉంటారుగానీ న్యాయవ్యవస్థలోని వారు ప్రత్యేకంగా కలవాలనే ఆసక్తి ఎప్పుడోగాని చూపించరు!

నేను రమ్మని చెప్పిన మరుక్షణం మేజిస్ట్రేట్‌గారు వచ్చారు. కుశలప్రశ్నల కార్యక్రమం జరుగుతున్నప్పుడు మా వాళ్ళు ఆయనకు టీ బిస్కట్లతో మర్యాద జరిపిన తర్వాత, ఆయన టేబుల్‌ సర్దుతున్న ఆర్డర్లీని ఇబ్బందిగా చూస్తూ ‘‘మీతో ఒంటరిగా మాట్లాడాలి’’ అన్నారు.నేను ఆ సర్దేవాణ్ణి బయటకు వెళ్ళమని సైగ చేశాను.అతను వెళ్ళిపోయిన కాసేపటికి మేజిస్ట్రేట్‌ గారు తేరుకుని చెప్పసాగారు.‘‘సార్‌! నేను చెప్పేవిషయాన్ని మీరు ఏ విధంగా తీసుకుంటారో నాకు తెలియదు! కానీ చెప్పకతప్పదు. వారం రోజుల్లో మా అమ్మాయి పెళ్ళి ఉంది’’ అంతవరకే చెప్పి ఆయన కళ్ళుమూసుకున్నారు.‘‘చెప్పండి..’’ అని నేను ప్రోత్సహించాను.

‘ఏమైనా సంబంధం విషయంలో ఇబ్బందులు వచ్చాయేమో’ అని ఆయన వాలకం పసిగట్టే ప్రయత్నం చేస్తున్నప్పుడు ‘‘మూడ్రోజుల క్రిందట మా ఇంట్లో దొంగతనం జరిగింది. పెళ్ళికి సమకూర్చుకున్న ఆభరణాలతోపాటు పెద్ద మొత్తంలో అప్పుగా తెచ్చుకుని ఉంచుకున్న నగదు కూడా పోయింది. రాత్రివేళ నిద్రిస్తున్నప్పుడు, దొంగలు ఇంటికి కన్నంవేసి ఇంట్లో ప్రవేశించారు. మా అందరికీ అంత మొద్దునిద్ర ఎలాపట్టిందో ఇప్పటికీ మాకు అర్థం కావటం లేదు. కానీ అంతా ఊడ్చుకుపోయింది. మా గౌరవం నడిబజాట్లో పడేసి మాకున్నదంతా దొంగ వెధవలు పట్టుకుపోయారు’’ కోపంతో కూడిన ఉక్రోషంతో మేజిస్ట్రేట్‌గారు బాధనంతా వెళ్ళగ్రక్కారు.