ఆయన రిటైరై దాదాపు పదేళ్ళు. టైమ్‌ ప్రకారం అన్నీ జరిగిపోవాలనే మనిషి. కానీ ఆయన భార్యకు ఈ మధ్య మతిమరపు ఎక్కువైపోయింది. సమయానికి కాఫీ, టిఫిన్‌ ఇవ్వలేకపోతోంది. ప్రతీదీ మరచిపోతోంది. డాక్టర్ని సంప్రదిస్తే అది వయసుతోపాటు వచ్చేదే. ఆమెను సరదాగా బయటకు తీసుకెళ్ళండన్నారు. సరేకదా అని వెళితే సినిమా హాల్లో తప్పిపోయింది. అతడికి ఏం చెయ్యాలో తోచక కూతుర్ని పిలిపించాడు. అప్పుడు ఏం జరిగిందంటే....

******************************

ఉదయం తొమ్మిది గంటల సమయం. అప్పటికి గంటనుంచీ దినపత్రిక తిరగేస్తూనే ఉన్నాను. చదివిందే చదవడమంటే విసుగు నాకు. పేపర్ని విసురుగా నా ముందున్న టీపాయ్‌ మీదికి విసిరేశాను. ఎదురుగా గోడమీద టిక్కుటిక్కుమంటూ నన్ను వెక్కిరిస్తూ నడుస్తోన్న గడియారంలోని సెకండ్లముల్లువైపు అసహనంగా చూశాను. నాకు ప్రతిదీ టైం ప్రకారం జరగాలి. ఈ విషయం మా పెళ్ళయిన రోజే శిరీషకు అర్థమయ్యేలా చెప్పాను. గడియారంలోని ముల్లైనా గతి తప్పుతుందేమోగాని నా దినచర్యలో క్షణం తేడా వచ్చినా నేను తట్టుకోలేను.లోపలినుంచి తన్నుకొస్తున్న కోపాన్ని దిగమింగతూ శిరీష ఏం చేస్తోందా అని చూశాను. పూజగదిలో అమ్మవారి విగ్రహం ముందు ముకుళిత హస్తాలతో కూచుని స్త్రోత్రం చదువుతోంది. రోజూ ఉదయం తొమ్మిదింటికల్లా పూజగదిలోకి దూరి కనీసం అరగంటసేపు అమ్మవారి విగ్రహం ముందు గడపటం తన అలవాటు.

‘తన దైనందిన చర్యలన్నీ టైం ప్రకారం పాటిస్తూ నా అలవాట్లను మరచిపోతే ఎలా? నలభై ఆరేళ్ళ మా దాంపత్య జీవితంలో ఉదయం ఎనిమిదింటికల్లా నాకు ఫలహారం పెట్టకుండా ఎప్పుడైనా తాత్సారం చేసిందా? ఇప్పుడెందుకు నేనంటే అంత నిర్లక్ష్యం?రిటైరైనాను కాబట్టి ఆలస్యంగా వడ్డించినా పర్లేదనుకుంటోందా? అదే నిజమైతే మరి నిన్నటివరకు టైం ప్రకారమే అన్నీ చేసిందిగా. నేను రిటైరై పదేళ్ళు. ఈ పదేళ్ళలో లేని మార్పు ఈ రోజెందుకు వచ్చింది? నాకు వెంటనే దానికి సమాధానం స్ఫురించింది. మతిమరుపు. వయసు పైబడేకొద్దీ కొంతమందిలో కనిపించే మతిమెరుపు. నాకిప్పుడు డెబ్భైయేళ్ళు. శిరీ నా కంటే రెండేళ్ళు చిన్నది. ఇప్పటికీ నా జ్ఞాపకశక్తి అమోఘంగా ఉంది. మరి నాకంటే చిన్నదైన నా భార్య ఎందుకు మతిమరుపుకు గురవుతోంది? నాలో మెల్లగా సన్నటి భయం మొదలై కొన్నిక్షణాల్లోనే విరాట్‌ రూపం దాల్చసాగింది. ఈ మతిమరుపు పెరిగి పెరిగి చివరికి అల్జీమర్స్‌ వ్యాధిలోకి దింపదుగా...!’