గ్రీష్మం.

సూర్యోదయం కాకపోయినా రాత్రి గడిచిన వేడి ఆవిర్లు ఇంకా తగ్గలేదు.

మట్టి గోడల ఇల్లు. తాటాకుల కప్పు. నులక మంచం మీద పడుకున్న విశ్వపతి మెల్లగా కళ్ళు తెరిచాడు. గోడలో చెక్క బద్దలు అమర్చిన కిటికీలోంచి ఉదయిస్తున్న సూర్య కిరణం తళుక్కున మెరిసింది. వేడికి తట్టుకోలేకనో వసంతం ఇంకా పోలేదనో కోయిలలు తెల్లవారుఝాము నుంచి కూస్తూనే ఉన్నాయి.అతని జ్వర తీవ్రతతో పాటు తెల్లని శరీర ఛాయపై ఎర్రటి మచ్చలు వ్యాపించాయి. అవి బొగ్గుకణికలు కాలినట్లు మండుతూ వున్నాయి. ఒళ్లంతా చెమటలు. అర్ధరాత్రి అతని ముసలి తల్లి బ్రాహ్మణ వాటికలో ఉన్న భిషక్కు నుంచి తెచ్చిన కషాయం తాగాక శరీరమంతా మళ్లీ మంటలు.విశ్వపతి ఒక అసాధారణ శిల్పి.అటు గాంధార దేశం నుంచి ఇటు పాటలీపుత్రం దాకా ఎక్కడ ఆరామాలు కట్టాలన్నా, శిల్పాలు తయారు చేయాలన్నా ఆమ్రపురి గ్రామానికి వెతుక్కుంటూ వస్తారు. ముఖ్యంగా బౌద్ధ విగ్రహాలు రాతి నుంచి చెక్కటంలో, ఇంకా ఇతర శిల్పులనీ నిర్దేశించి మహోన్నతమైన విగ్రహాలని కొండ గుహలలో మలచగలిగిన కళాకారుడు.పుట్టుకతో విశ్వ బ్రాహ్మణుడైనా అత్యంత వైదిక ధర్మాన్ని ఆచరించే నిష్ఠ కలవాడు.

త్రిసంధ్యలలో గాయత్రీ జపం, పర్వదినాలనందు ఉపవాసం, పూజా కార్యక్రమాలు విధిగా నిర్వహించేవాడు.శిల్పమే అతని అభిరుచి. వైదిక నిష్ఠయే అతని జీవితం.కానీ కొన్ని సంవత్సరాల ముందు గాంధార దేశంలోని ఓ ఆరామ శిల్పాలు చెక్కడానికి తక్షశిల నగరం శివార్లలో చైత్య విహారాలకి వెళ్ళటంతో అతని జీవితం మారిపోయింది.తక్షశిలలో ఆరామాలలో బుద్ధ విగ్రహాలు చెక్కే పనిలో గత నాలుగు సంవత్సరాలు గడిపాడు. పగలల్లా శిల్పాలు చెక్కడం, పర్యవేక్షణ.. సాయంత్రానికి బౌద్ధ ఆరామానికి చేరుకుని తనకిచ్చిన ఆవాసంలో భోజనాదికాలు ముగించి సేద తీరేవాడు.అప్పుడే పరిచయమైంది ఆమె. పేరు ఆనందిని. ఆ రామంలో ఒకపక్క బౌద్ధ భిక్షువులు, మరొక పక్క గదులలో సన్యాసినులు ఉండేవారు. మూడు పూటలా త్రిపిటకాల పఠనంతో ఆరామం మారు మోగేది.అందరికీ భోజనశాల ఉండేది. బౌద్ధ ధర్మానుసారం భిక్షాటన చేసిన ఆహార పదార్థాలు కాక శిల్పులకి ఇతర దేశాల నుంచి వచ్చిన వారికి వంటలు వండేవారు.