ఏదో పని ఉండి తాలూకా ఆఫీసుకి వెళ్ళాడు శేషగిరి. పదేళ్ళ తర్వాత అక్కడికి వెళ్ళడం మళ్ళీ ఇదే. అక్కడ రమణమూర్తి కనిపించాడు శేషగిరికి. చాలాకాలానికి కలుసుకున్న మిత్రులిద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. పనిపూర్తయ్యాక మిత్రుణ్ణి తన ఇంటికి తీసుకెళ్ళాడు రమణమూర్తి.వాకిట్లోకి అడుగుపెడుతూనే ఇల్లంతా పరికించి చూశాడు శేషగిరి. ముందున్న రేకులషెడ్‌ మీదంతా శంఖుపూలతీగ బాగా ఒత్తుగా అల్లుకుని ఉంది. లోపలికి రాగానే నాలుగుగదుల డాబా ఇల్లు. కబోర్డులు బిగించి చాలా బాగుంది. ఇల్లంతా మారిపోయినందుకు ఆశ్చర్యపోతూ, ‘‘లాటరీ ఏమైనా తగిలిందా ఏమిటి? మంచి ఇల్లే కట్టావు’’ అన్నాడు శేషగిరి.

‘‘నువ్వు ఊహించింది నిజమే. అవన్నీ తర్వాత చెబుతానులే. రా లోపల కూర్చుని మాట్లాడుకుందాం’’ అంటూ గదిలోకి తీసికెళ్ళాడు.‘‘సరళా! ఎవరొచ్చారో చూడు. అలాగే రెండు కప్పులు కాఫీ!’’ అన్నాడు.‘‘అలాగేనండీ వస్తున్నా!’’ అంటూ కాఫీకప్పులతో వచ్చి అక్కడ శేషగిరిని చూసి ఆశ్చర్యపోతూ, ‘‘అన్నయ్యగారూ బాగున్నారా! ఇంతకాలానికి గుర్తొచ్చామా!’’ అని పలుకరించింది.‘‘వాడికి మనం గుర్తు రాలేదు. నేనే గుర్తుపెట్టుకొని తీసుకొచ్చా!’’‘‘మంచిపని చేశారు. వదినా పిల్లలు ఎలా ఉన్నారు. వాళ్ళని కూడా తీసుకొస్తే బాగుడేంది!’’‘‘నేను ఆఫీసు పని మీద వచ్చానమ్మా, ఈసారి తప్పకుండా తీసుకొస్తానులే!’’ అన్నాడు శేషగిరి. ‘‘ఈ పూట వీడు ఇక్కడే భోంచేస్తాడు వంటయిందా’’ అన్నాడు రమణమూర్తి.‘‘వంటపూర్తై చాలాసేపయింది. పిల్లలు మీ కోసమే ఎదురు చూస్తున్నారు’’‘‘ఐతే ఇంకా ఆలస్యం ఎందుకు వడ్డించు’’ అన్నాడు.

టేబుల్‌ మీద అన్నీ రెడీచేసి మిత్రులిద్దరినీ భోజనానకి పిలిచింది సరళ. కంచంలో వడ్డించిన పదార్థాలు చూసి, ‘‘ఏమిటి ఇవాళేమైనా స్పెషలా? ఇన్నిరకాలు చేశారు’’ అంటూ బొబ్బట్లు తుంచి నోట్లో పెట్టుకున్నాడు శేషగిరి. మెత్తగా కరిగిపోయింది. ‘‘ఇలాంటి బొబ్బట్లు తిని ఎంత కాలమైందో, ఎవరు చేశారోగానీ అచ్చం మా అమ్మ చేసినట్లే ఉంది. బొబ్బట్లు చేయటంలో మా అమ్మతో ఎవరూ పోటీపడలేరు. అంత బాగా చేస్తుంది’’ అన్నాడు శేషగిరి ఆనందంగా.