జీవితం చాలా చిన్నదని ఎక్కువమందికి అంతిమదశలో తప్ప తెలియకపోవచ్చు. అప్పటికి మన కాలం కరిగిపోతుంది. ఎంత గింజుకున్నా చేసేందుకు కాలంగానీ, ప్రాయంగానీ మిగలదు. సరిదిద్దుకోవడానికి గతం వెనక్కు తిరిగిరాదు. వగచి ప్రయోజనం కూడా ఉండదు. ఈ కథలో జరిగింది ఇదే. చాలామందిలాగే అతను కూడా తన కుటుంబాన్ని నిర్లక్ష్యం చేశాడు. గొప్ప నాయకుడుగా ఎదిగాడు. కానీ చివరకు అతడికేంమిగిలిందంటే....

****************************************

నేను:‘‘ఇప్పుడు ఎలా ఉంది. ఫర్వాలేదుగా. డాక్టరమ్మతో మాట్లాడాను. భయపడాల్సిందేమీలేదని అన్నారు. కాకపోతే ఒక వారం రోజులు రెస్ట్‌ అవసరమట. మందులు తెప్పించాను, జాగ్రత్తగా వాడాలి. అన్నట్టు నువ్వేమీ వంటా అదీ చెయ్యక్కర్లేదు, సుబ్బమ్మ అని వంటావిడ సాయంత్రం వస్తుంది. సరేనా? నాకు ఈ రోజు చౌక్‌లో ధర్నా కార్యక్రమం ఉంది. నా కోసం ఎదురు చూడకు. రెస్ట్‌ తీసుకో వస్తామరి!’’ అని బయటకు వచ్చాను.అప్పటికే ఓ పదిమంది నాకోసం ఎదురు చూస్తున్నారు. వెనక్కి తిరిగిచూశాను. ఎందుకో, దిగులుగా తలవొంచుకుని నేల చూపులు చూస్తోంది వనజ. ఎలాగో అనిపించింది. అసలే ఒట్టి మనిషి కాదు. నాలుగోనెల దాటింది. బలహీనంగా ఉందని డాక్టర్‌ అంది. వెనక్కివెళ్ళి ఓ పదినిమిషాలు ఆమెతో గడుపుదామనుకుంటున్న సమయంలో ‘‘సార్‌! ఇప్పటికే బాగా లేటైంది. పార్టీ కార్యకర్తలందరూ ఎదురు చూస్తున్నారు. వెళ్దామా’’ పరాంకుశం మాటతో మనసు మార్చుకుని ముందుకే అడుగువేశాను. ఇది అలవాటే! ప్రతిసారీ ఇలాగే జరుగుతూ ఉంటుంది.‘‘అధికారపక్ష ఆగడాలు నశించాలి. కార్మికులకు న్యాయం జరగాలి. ప్రభుత్వరంగ స్పిన్నింగ్‌ మిల్లు మళ్ళీ తెరవాలి’’ అంటూ నినాదాలు చేస్తూ రోడ్డుమీద బైఠాయించాం.

పోలీసులు అడ్డుకున్నారు. వాదనలు తోపులాటలు. ఇంతలో ఎవడో రాయివేశాడు. అంతే రాళ్ళవర్షం కురిసింది. పోలీసు లాఠీలకు పనిచెప్పారు. మా వాళ్ళందరికీ బానే లాఠీదెబ్బలు తగిలాయి. అడ్డుపోయిన నాకు ముంజేతిమీద గాయమైంది. మమ్ముల్ని బలవంతంగా వ్యాన్‌లో పోలీసు స్టేషన్‌కు తరలించారు. చీకటిపడేవేళకుగానీ మమ్ముల్ని వదిలిపెట్టలేదు. ఇదిఇ ఒక్కరోజులో పరిష్కారమయ్యే వ్యవహారం కాదు. దానికోసం మరోస్ట్రాటజీ రూపొందించాలి. ఇంకో ప్రణాళిక కావాలి. దాంతో రాత్రి పది దాటింది టైమ్‌. ఇంటికి చేరేసరికి వనజ హాల్లో కూర్చుని ఉంది. ‘‘ఇంకా పడుకోలేదా?’’ పలకరింపులాంటి నా ప్రశ్న నాకే ఎబ్బెట్టుగా అనిపించింది. నిర్లిప్తంగా నవ్వింది. తన చూపులో కోటి ప్రశ్నలు! నన్ను నేను తప్పుపట్టుకోవడంతో నాలో చిరాకుపెరిగిపోయింది. నామీదనాకే కోపం అనిపించింది. ఆ కోపం బయటకుపోవడానికి ఒకదారి ఉండాలిగా!