‘మోసం దగా’ అన్నాడు కోపంగా... అంటూనే విసురుగా లేచి తలుపుతీసి బయటికి వెళ్లి పోయాడు. పెళ్లికూతురు బిక్కమొహం వేసింది.హాల్లో పడుకున్న నిర్మలమ్మ మనవడు శోభనం గదిలోంచి విసురుగా రావడం చూసి గాభరగా లేచి కూర్చుంది. ‘ఏమిటరా నాన్నా ఇలా బయటికి వచ్చావు. ఏం కావాలి’ అంది ఆరాటంగా..

*********************

‘ఏమిటీ’ ఒక్కసారే అరిచినట్లున్నారు తల్లి, తండ్రి, మామ్మ.‘‘అవును. నాకు ఇంజనీరింగులు, ఎంబిఏలు, ఉద్యోగాలు చేసే అమ్మాయిలు వద్దు – హాయిగా ఇంటిపట్టున వండి పెడుతూ, ఇల్లు, సంసారం పిల్లలు చూసుకునే అమ్మాయి చాలు’ పండు బాబు ఉరఫ్‌ చైతన్య తెగేసి నిర్ణయం చెప్పాడు. అమెరికాలో ఎమ్మెస్‌ చేసి, మంచి ఉద్యోగం చేసే కొడుకు పెళ్లిచేసుకోమంటే, ఇలాంటి కోరిక కోరిన కొడుకుని తెల్లపోయి చూశారు’’ అవును. నాకు వంటొచ్చిన పెళ్లాం కావాలి. ఏదో మాములు డిగ్రీ ఉండి, కాస్త స్మార్ట్‌గా ఉంటే చాలు అర్థమయ్యేట్టు మళ్ళీ చెప్పాడు.

‘‘వంటొచ్చిన పెళ్లాం అంటే, వంటల్లో డిగ్రీలుండాలా’ అర్థం కానట్టంది తల్లి.‘‘పో, అమ్మా, అది కాదు, చక్కగా మన సాంప్రదాయ వంటలు రుచిగా చేసే అమ్మాయిని చూడండి. ఉద్యోగాలు చేసే అమ్మాయిలు నాకొద్దు. నాకు తిండి సుఖం, ఇంటి సుఖం కావాలి. వద్దని మొత్తుకున్నా వినకుండా యుఎస్‌ పంపారు. నాలుగేళ్ళ నించి తిండి లేకుండా మల మలమాడుతున్నాను. ఇప్పటికన్నా హాయిగా కావల్సినవి తినాలి నేను’’.‘‘ఓరి నీ తిండి గోల ఏమిట్రాబాబూ. ఎవరన్న అందం, చదువు, ఉద్యోగం కావాలంటారు’’.‍‘‘ఆ చూశాలే, ఉద్యోగం చేసే అమ్మాయిల సంగతి, మా ఫ్రెండ్స్‌ నానాగడ్డి కరుస్తున్నారు. కూరలు వీళ్లే తరగాలి. కుక్కర్లు వీళ్లే పెట్టాలి. గిన్నెలు వీళ్లే తోమాలి.

తరిగిన కూర పోపులో వేసో, వేయించో, ఇంత పప్పు కుక్కర్లో వండి, ఇండియా నుంచి తెచ్చిన పచ్చడి ప్లేట్లలో వేసేసరికి చాకిరి అంతా వాళ్లే చేస్తున్నట్టు ఫోజులు, చికాకులు, కసుర్లు, విసుర్లు, సరిసమాన జీతం, సరిసమాన పని పంచుకోవాలని నినాదాలు, ఎవరు ముందొస్తే వాళ్లు వండాలి అని షరతులు, ఓ వారం నీవు, ఓ వారం నేను అంటూ సర్దుబాట్లు, పిల్లలుంటే సరేసరి నేపీలు మార్చాలి, ఫీడింగ్‌ బాటిల్స్‌ స్టెరిలైజ్‌ చెయ్యాలి. రాత్రిళ్లు ఏడిస్తే వాళ్లతో పాటు వీళ్లూ మేలు కొని కూర్చోవాలి. ఓరి నాయనో వాళ్ల సం‍సార పాట్లు చూశాక, ఆడవాళ్ల డిమాండ్లు చూశాక చచ్చినా ఉద్యోగం చేసే అమ్మాయ వద్దనుకున్నా..’’