రైలు కదలనున్నట్లు ప్రకటన వినిపించింది.‘‘నువ్వింక దిగు బాబూ’’ అంది సునంద.బెర్త్‌ మీదినించి లేచి నిల్చున్నాడు వాసు.‘‘జాగ్రత్త అమ్మా! ఎక్కువగా ఆలోచించక దారి పొడుగునా. ఆట్టే తీసుకోకుండా వెళ్ళిపోయింది అత్తయ్య. అదృష్టవంతురాలు అని సరిపెట్టుకుందాం. నువ్వు కాస్త నిబ్బరంగా ఉండు. రేపు ముఖ్యమైన బోర్డ్‌ మీటింగ్‌ ఉంది గనుక గానీ, లేదంటే నేనూ నీతో వచ్చేవాడినే’’ ఏ పదోసారో చెప్పాడు తల్లితో.‘‘నా గురించి ఆలోచించకురా ఫర్వాలేదు. నేను వెళ్ళి వస్తాను. నువ్వు రాలేకపోతున్నందుకు ఇదవ్వకు’’ అన్నదామె. అతను రైలు దిగిపోయాడు. ఆరింటికల్లా టైం ప్రకారం కదిలింది రైలు.‘‘ఎక్కడి దాకా?’’ ప్రశ్నించింది ఎదుటి బెర్త్‌లో కూర్చొన్న మహిళ. నిరాసక్తంగా చెప్పింది సునంద.‘‘అబ్బో... చాలా దూరమే. నన్ను దాటి నాలుగు గంటల ప్రయాణం.’’తనెక్కడికి వెళ్ళాలో చెబుతూ అంది ఆమె. సునంద ఏమీ మాట్లాడలేదు. మాట్లాడే మనఃస్థితిలో లేదు.

 

పది నిమిషాల తరవాత మళ్ళీ కదిలించింది ఎదుటి బెర్త్‌ మహిళ. ఆ నాలుగు బెర్తుల కూపేలో మిగతా రెండు బెర్తులు ఖాళీగా ఉన్నాయి.‘‘నాపేరు పార్వతి. మా అమ్మాయి పురిటి రోజులు. రెండో కానుపు అక్కడే చేయిస్తానని పట్టు పట్టారు మా వియ్యపురాలూ, వియ్యంకుడూ. వాళ్ళ మాటేకదా సాగేది ఎప్పుడైనా. అందుకే, నేనే బయల్దేరి వెళుతున్నాను, పురుటి సమయానికి దగ్గరుండాలని’’ చెప్పిందామె.మౌనంగా విని ఊరుకుంది సునంద. ఆమె మనసునిండా శమంత ఉందిప్పుడు. ఈ లోకాన్ని ఖాళీ చేసేసింది గనుక, మరేబాదరబందీ లేదన్నట్టు వచ్చి, సునంద మనసులోనే తిష్ఠ వేసుకుంది.‘‘మీరేం పనిమీద వెళ్తున్నారు?’’ సునంద మౌనాన్ని విస్మరిస్తున్నట్టు, అడిగింది పార్వతి.‘‘నా స్నేహితురాలు ఒకామె గురించి దుర్వార్త విన్నాను. చివరి చూపుకోసం వెళ్తున్నాను’’ సీరియస్‌గా చెప్పింది సునంద, ఆ మాట వినటంతోటే శుభకార్యం కోసం వెళ్తున్న పార్వతి ముఖం తిప్పేసుకుని ఊరుకుంటుంది, ఇంక ఏమీ మాటలు పెంచదు అని ఊహిస్తూ. కానీ, తద్విరుద్ధంగా స్పందించింది పార్వతి‘‘అయ్యో, అలాగా. అందుకా మీ అబ్బాయి అంత బాధపడుతూ వెళ్ళాడు! అయాం సారీ’’ అంది సానుభూతిగా.