‘ష్‌... ఎం.డీ సారొస్తున్నారు. లేచి నిలబడు లాస్యా!’’ హెచ్చరించాడు కమల్‌.స్టాఫంతా లేచి విష్‌ చేస్తుంటే, వారికి ప్రతిగా చిరునవ్వుతో విష్‌ చేస్తూ హుందాగా తన ఛాంబర్‌వైపు నడిచి వస్తున్న దిలీప్‌చంద్రను కన్నార్పకుండా చూస్తుండి పోయింది లాస్య.

ఆరడుగుల ఎత్తున్న దిలీప్‌ గ్రే కలర్‌ సూట్‌లో మహారాజులా మెరిసిపోతున్నాడు. రిమ్‌లెస్‌ కళ్ళజోడు, చెంపలపై కొద్దిగా నెరుస్తున్న జుట్టు. ఇప్పుడిప్పుడే తెల్లరంగు సంతరించుకుంటున్న మీసాలు...వయస్సు అతని అందానికి ఒక హుందాతనాన్ని, రాచఠీవిని తెస్తోంది. అణువణువూ ఆత్మవిశ్వాసం ప్రతిఫలిస్తుండగా, ఆప్యాయత పంచే చిరునవ్వుతో ఈ ప్రపంచంలోకెల్లా అపురూపమైనవ్యక్తిగా తోచాడు. మెత్తని తివాచీపై వినిపించని ఆ అడుగులసడి ఆమె గుండెలో శ్రావ్యమైన సంగీతమై ధ్వనిస్తూఉంటే, అంతులేని దాహార్తిగల వ్యక్తి అమృతకలశంవైపు చూస్తున్నట్టు ఆరాధనతో అతన్ని చూడసాగింది లాస్య.‘‘రెండు రోజులనుంచి అడుగుతున్నావ్‌గా, ఆయనే మన సౌజన్యా గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్ అధినేత దిలీప్‌చంద్రగారు.

ఇదిగో, ఈ రోజే టూర్‌నుంచి వచ్చారు’’ నవ్వుతూ చెప్పాడు కమల్‌.‘‘చూడమ్మా. ఇప్పటివరకూ నేనే ఆయనకి పి.యస్‌.గా ఉన్నాను. కానీ తప్పనిసరి పరిస్థితుల్లో నన్ను కోల్‌కతా బ్రాంచికి పంపించే అవసరం వచ్చింది. నా స్థానంలోకి వచ్చిన నువ్వు, నాకన్నా సమర్థవంతంగా విధినిర్వహణ చేస్తావని నమ్ముతున్నాను. అయితే నీకిది మొదటి ఉద్యోగం గనుక అనుభవం లేదు. అందుకే నీకు ఛార్జ్‌ అప్పజెబుతూనే, నా అనుభవాలు, దిలీప్‌గారితో వ్యవహరించాల్సిన తీరూ వివరిస్తూనే ఉన్నాను. వాటిని క్షుణ్ణంగా ఆకళింపు చేసుకుంటే వారి సెక్రటరీగా రాణించగలవు. విద్యార్హతలు నీకెలాగూ....’’ ఇంటర్‌ కామ్‌ గ్రీన్‌గా వెలగటంతో ఆపేసి, ‘‘పిలుస్తున్నారు...రా వెళదాం’’ అని సీట్‌లోంచి లేచాడు కమల్‌.