హరిహరకళాభవన్‌, ఏప్రిల్‌ 15(ఆంధ్రజ్యోతి): కళల పరిరక్షణ అందరి బాధ్యతని తమిళనాడు మాజీ గవర్నర్‌ రోశయ్య అన్నారు. సికింద్రాబాద్‌ హరిహరకళాభవన్‌లో సోమవారం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ సౌజన్యంతో సంస్కార గురుకుల సంస్థ ఆనందోత్సవం పేరిట వివిధ రంగాలలో కృషి చేసిన ప్రముఖులను ఘనంగా సత్కరించింది. ముఖ్యఅతిథిగా విచ్చేసిన  రోశయ్య మాట్లాడుతూ అందరూ సమాజ సేవ చేయాలన్నారు. తెలంగాణ  బీసీ డెవల్‌పమెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ తాడూరి శ్రీనివాస్‌ సభాధ్యక్షత వహించారు. గౌరవ అతిథిగా  సర్వే సెటిల్‌మెంట్‌, ల్యాండ్‌ రికార్డ్స్‌ కమిషనర్‌ వనమాల చంద్రశేఖర్‌, ప్రత్యేక అతిథులుగా సినీనటుడు జెన్నీ, అరుంధతి కళాక్షేత్ర వ్యవస్థాపకుడు ప్రభాకర్‌ విచ్చేశారు. రిషి స్పోర్ట్స్‌ అకాడమీ వ్యవస్థాపకుడు బాక్సింగ్‌ కోచ్‌ మగేష్‌, ఆయుర్వేద రంగంలో విశేష కృషి చేసిన సుదర్శన్‌ ముదిరాజ్‌, సర్వ్‌ నీడీ ఫౌండర్‌ గౌతమ్‌ కుమార్‌లను ఘనంగా సత్కరించారు. సంస్థ ప్రతినిధులు జయశ్రీ రాజకుమార్‌, ప్రహ్లాదరావు, సంస్థ ప్రగతిని వివరించారు. చిద్విలాసిని, విష్ణువర్ధన్‌, సమీర, కార్తీకేయ, శ్రుతి, ప్రణీత నృత్యాలు అలరించాయి. వ్యాఖ్యాతగా మోహన్‌గాంధీ వ్యవహరించారు.