హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 17 (ఆంధ్రజ్యోతి): దళిత, బహుజన ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత కసుకుర్తి రామలింగం (49) మృతి చెందారు. అక్టోబరు 10న ఆయన సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కుతుండగా ప్రమాదానికి గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఆయన నిమ్స్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం కన్నుమూశారు. ఆయనకు భార్య గోవిందమ్మ, ముగ్గురు కుమారులున్నారు. రామలింగం సొంతూరు ప్రకాశం జిల్లాలోని టంగుటూరు మండలం అనంతవరం గ్రామం. విద్యార్థి దశలో వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యారు. కొన్ని ప్రముఖ పత్రికల్లో కాలమిస్టుగానూ సేవలందించారు. ఈశ్వరీబాయి సంక్షిప్త జీవిత చరిత్ర ‘అగ్నిశిఖ’, తొలి తెలుగు గిరిజన మహిళా ఐఏఎస్‌ అధికారిణి భూక్యా చంద్రకళ సహచరుడు అజ్మేరా రాములునాయక్‌ స్ఫూర్తిగాథ ‘ఉలిచెక్కని శిల్పం’ తదితర పుస్తకాలు రచించారు. రామలింగం అంత్యక్రియలు శుక్రవారం ఆయన స్వగ్రామంలో జరగనున్నట్లు బహుజన కార్మిక సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కన్నెదారి నాగభూషణం, రచయిత మాల్యాద్రి తెలిపారు.