చిక్కడపల్లి, ఆగస్టు 17(ఆంధ్రజ్యోతి): కమలాకర సేవారత్న పురస్కార ప్రదానం ఘనంగా నిర్వహించారు. త్యాగరాయ గానసభలో శనివారం రాత్రి కమలాకర చారిటబుల్‌ ట్రస్ట్‌, కమలాకర లలిత కళాభారతి సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. కవి, డాక్టర్‌ ఆచార్య ఫణీంద్ర,  దేశభక్తి గీతాల గాయని ఊటుకూరి భూదేవిలకు పురస్కారాలను హైకోర్టు పూర్వ జస్టిస్‌ ఎ.రామలింగేశ్వరరావు ప్రదానం చేశారు. రామలింగేశ్వరరావు, రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి డాక్టర్‌ సీఎన్‌ గోపీనాథ్‌రెడ్డి మాట్లాడుతూ పురస్కారాలు తీసుకునేవారి వల్ల పురస్కారాలకు వన్నె పెరుగుతుందన్నారు. అలాంటివారిని ఎంపిక చేసి సన్మానించండం అభినందనీయం అన్నారు. కార్యక్రమంలో వేంకటేశ్వరయూనివర్సిటీ పూర్వ వీసీ ఆచార్య కొలకలూరి ఇనాక్‌, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రచయిత్రి డాక్టర్‌ కేవీ కృష్ణకుమారి, నిర్వాహకురాలు భారతీ కమలాకర్‌ తదితరులు పాల్గొన్నారు.