ఆబిడ్స్‌, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): కవిగా, రచయితగా, అనువాదకుడిగా, అనేక వేదికల నిర్వాహకుడిగా డాక్టర్‌ వెల్చాల కొండలరావు గణనీయమైన పాత్ర పోషించారని పలువురు వక్తలు కొనియాడారు. తెలుగు అకాడమీ పూర్వ సంచాలకుడు, సాహితీవేత్త డాక్టర్‌ వెల్చాల కొండల్‌రావుకు సారస్వత పరిషత్తు శుక్రవారం డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు సాహితీ పురస్కారాన్ని ప్రదానం చేసింది. సారస్వత పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన సభలో శాంతా బయోటెక్నిక్‌ స్థాపక అధ్యక్షుడు డాక్టర్‌ వరప్రసాదరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని కొండలరావుకు రూ.25 వేల నగదు, ప్రత్యేక జ్ఞాపికను పురస్కారం కింద బహూకరించారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ కొండలరావుకు డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు పురస్కారం అందజేయడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. డాక్టర్‌ వెల్చాల కొండలరావు కవిత్వం, విమర్శ, వ్యాసం వంటివి తెలుగులో రచనలు చేస్తూ వివిధ భాషల నుంచి తెలుగులోకి అనువదించారని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ర్టానికి జరుగుతున్న అన్యాయంపై ఎలుగెత్తడమే కాకుండా తెలుగు భాషను పరిరక్షించే విధంగా వేదికలు నిర్వహించారని అన్నారు.

ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షోపన్యాసం చేస్తూ దేవులపల్లి రామానుజరావు సారస్వత పరిషత్తు అభివృద్ధికి ముఖ్య కారకులన్నారు. డాక్టర్‌ సి.నారాయణరెడ్డి రామానుజరావును ఎంతో గౌరవించి సారస్వత పరిషత్తు సమావేశ మందిరానికి అధ్యక్షుడిగా  ఆయన పేరు పెట్టారని తెలిపారు. పరిషత్తు ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ జుర్రు చెన్నయ్య స్వాగతోపన్యాసం చేస్తూ డాక్టర్‌ దేవులపల్లి రామానుజరావు 1944లో కార్యవర్గ సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించి 1993లో కన్ను మూసే వరకు సారస్వత పరిషత్తు ద్వారా తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి అవిరళ సేవలందించారని అన్నారు. కార్యక్రమంలో పరిషత్తు కోశాధికారి మంత్రి రామారావు, మాజీ మంత్రి విజయరామారావు, ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్‌ రెడ్డితో పాటు పలువురు కవులు, రచయితలు పాల్గొన్నారు.