రవీంద్రభారతి, ఆగస్టు 16 (ఆంధ్రజ్యోతి): సమాజాన్ని అర్థం చేసుకుని అక్షరీకరించడం అభినందనీయమని ఎన్‌సీపీసీఆర్‌ మాజీ చైర్‌ పర్సన్‌ ప్రొఫెసర్‌ శాంతా సిన్హా అన్నారు. శుక్రవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో మాధవి, వెంకట్‌, సూర్య, కొండారెడ్డి రచించిన ‘దివ్య విద్య’ పుస్తకావిష్కరణ సభ నిర్వహించారు. అతిథిగా పాల్గొన్న శాంతా సిన్హా పుస్తకాన్ని ఆవిష్కరించి అభినందించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థుల మానసిక పరిస్థితిని టీచర్లు అర్థం చేసుకోవాలనే నేపథ్యాన్ని ఈ పుస్తకంలో వివరించారని తెలిపారు. పిల్లలకు విద్యతో పాటు దివ్య విద్య అవసర ముందని తెలిపారు. నలుగురు స్నేహితులు కలిసి దివ్య విద్య పుస్తకం రచించడం అభినందనీయమని అన్నారు. 

విశిష్ట అతిథిగా పాల్గొన్న వరల్డ్‌ యునైటెడ్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ యుగంధర్‌ మాట్లాడుతూ విద్య విలువను ఉపాధ్యాయులు తెలియజేయాలని అన్నారు. ఇప్పుడున్న సమాజానికి ఇలాంటి పుస్తకాలు అవసరమని అన్నారు. విద్యను అభ్యసించడంతో పాటు మానసిక దృఽఢత్వం అవసరమని అన్నారు. గౌరవ అతిథిగా పాల్గొన్న ఎంవీఎఫ్‌ కన్వీనర్‌ ఆర్‌.వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ తరగతి గదిలో ఆహ్లాదకరమైన వాతావరణం అవసరమనే విషయాలను పుస్తకంలో చేర్చడం సంతోషకరమని అన్నారు. ఈ పుస్తకం ప్రతి టీచర్‌ చదివే విధంగా ఉందని అన్నారు. దేశ భవిష్యత్తు తరగతి గదిలో ఉందని చాటి చెప్పారని కొనియాడారు. కార్యక్రమంలో రచయితలతో పాటు స్వర్ణలత పాల్గొన్నారు.