తీవ్ర దిగ్ర్భాంతికి గురైన సాంస్కృతిక రంగం 

సంతాపం ప్రకటించిన సాంస్కృతిక రంగ ప్రముఖులు 


రవీంద్రభారతి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత నర్తకీమణి, పద్మశ్రీ పురస్కారగ్రహీత శోభానాయుడు మృతి సాంస్కృతిక రంగాన్ని తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది. కూచిపూడి మహారాణి శోభానాయుడు లేరనే వార్తను కళారంగ ప్రముఖులు జీర్ణించుకోలేకపోతున్నారు. మహా నర్తకీమణిని కోల్పోయామంటూ పలువురు కళాభిమానులు కంటతడిపెట్టారు. పలువురు ప్రముఖులు, కళాకారులు, సాంస్కృతిక సంస్థల ప్రతినిధులు, కళాకారులు, నర్తకులు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. సంగమం ఫౌండేషన్‌ సంజయ్‌కిషోర్‌, కిన్నెర రఘురాం, యువకళావాహిని నాగేశ్వరరావు, కళ సంపాదకుడు మహ్మద్‌ రఫీ, వంశీరామరాజు, శృతిలయ ఆమని, సత్కళాభారతి సత్యనారాయణ, డాక్టర్‌ కె.ధర్మారావు, సామల వేణు, మర్రి రమేష్‌, కొత్త కృష్ణవేణి, శ్రీనివాస్‌, భువన, వడ్డెపల్లి కృష్ణ, శిఖరం కృష్ణ, కేకే రాజా, మెగాసిటీ మల్లికార్జున్‌రావు తదితరులు సంతాపం ప్రకటించారు.  
 
గొప్ప నర్తకిని కోల్పోయాం: రమణాచారి 
కూచిపూడి నాట్యానికి వన్నె తెచ్చిన గొప్ప నర్తకిని కోల్పోవడం బాధాకరం. వేలాదిమంది శిష్యులను ఆమె తయారు చేశారు. తెలుగు నాట్యా రంగానికి ప్రతీకగా నిలిచారు. ఆమె లేని లోటు తీర్చలేనిది. 30 ఏళ్లుగా ఆమెతో సాన్నిహిత్యం ఉంది. శోభానాయుడు ఆత్మ శాంతించాలని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.                      
 
శోభానాయుడు లేని లోటు తీర్చలేనిది: మామిడి హరికృష్ణ
కూచిపూడి నాట్యంతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న శోభానాయుడు లేని లోటు తీర్చలేనిది. ఎంతోమంది కళాకారులను తయారు చేయడంతోపాటు సరికొత్త నాట్యాన్ని పరిచయం చేశారు. రవీంద్రభారతిలో జరిగిన అనేక కార్యక్రమాల్లో కలిసి పాల్గొనడం అదృష్టంగా భావిస్తా.