సినిమా థియేటర్‌ వద్ద గుండెపోటు

సంతాపం వ్యక్తం చేసిన సీఎం కేసీఆర్‌

 

కూకట్‌పల్లి/హైదరాబాద్‌ సిటీ, జనవరి 13 (ఆంధ్రజ్యోతి): రేడియో వ్యాఖ్యాత, ప్రముఖ కథా రచయిత, ఆకాశవాణి కార్మికుల కార్యక్రమంలో ‘రాంబాబు’ పేరుతో విశేష ప్రజాదరణ పొందిన దివి వెంకట్రామయ్య గుండెపోటుతో సోమవారం మృతిచెందారు. ఆయన వయసు 78 సంవత్సరాలు. తన మనవడితో కలిసి ఆయన సోమవారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఫోరం సుజనామాల్‌లో సినిమా చూశారు.
 
మధ్యాహ్నం 3.30 గంటలకు బయటకు వచ్చిన కొద్దిసేపటికే గుండెపోటుతో కుప్పకూలారు. వెంటనే ఆయన్ను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయనకు భార్య కరుణ.. కూతుళ్లు భారతి, కవిత, కుమారుడు రాజేంద్రప్రసాద్‌ ఉన్నారు. వెంకట్రామయ్య స్వస్థలం ఏపీలోని కృష్ణాజిల్లా గుడివాడ తాలూక దొండపాడు. 1941 ఆగస్టు 20న జన్మించారు.
 
చిన్నతనం నుంచే నాటికలు, నాటకాలపై ఆయనకు ఆసక్తి మెండు. పాఠశాల రోజుల్లోనే రామాయణం, భారతం చదివారు. కళాశాల రోజుల్లో ఆంగ్లం, తెలుగు భాషల్లో 20కి పైగా నాటకాల్లో నటించారు. 1963లో ఆలిండియా రేడియోలో అనౌన్సర్‌గా చేరారు. అనంతరం రచయితగా, న్యూస్‌ ఎడిటర్‌గా, న్యూస్‌ రీడర్‌గా, ట్రాన్సేలేటర్‌గా 34ఏళ్లపాటు సేవలందించి 1997 ఫిబ్రవరి 28న రిటైర్‌ అయ్యారు. 80కిపైగా కథలు, 200కుపైగా నాటకాలు, నాటికలు రచించారు. 70 దశకంలో వచ్చిన పంతులమ్మ సినిమాకు మాటల రచయితగా పనిచేశారు.
 
ఆయన రచించి, నటించిన సీరియళ్లలో పువ్వుల మేడ, వెన్నెలవాన, రంగు వెలసిన మనుషులు, స్వీట్‌ హోమ్‌, పొగ మంచు వంటివి ప్రజాదరణ పొందాయి. హిందీ, మరాఠీలో ప్రచురించిన నవలను తెలుగులో అనువాదం చేశారు. కాగా.. వెంకట్రామయ్య మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం తీవ్ర సంతాపం వ్యక్తం చేసిన మీడియా అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ, ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. మంగళవారం ఈఎ్‌సఐ శ్మశానవాటికలో అంత్యక్రియలను నిర్వహించనున్నట్లు బంధువులు తెలిపారు.