యువకళావాహిని ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా పురస్కారం
సినిమా, టెలివిజన్‌, మీడియా అవార్డుల ప్రదానోత్సవం
ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి జర్నలిస్టుకు పురస్కారం
 
హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు13 (ఆంధ్రజ్యోతి): మనసులోని బాధలను ముఖంపై కనపడకుండా, తమ పాత్రలో లీనమయ్యే సినిమా, టెలివిజన్‌ నటులను సత్కరించడం అభినందనీయం అని మాజీ గవర్నర్‌ కొణిజేటి రోశయ్య అన్నారు. మంగళవారం బంజారాహిల్స్‌లోని ప్రసాద్‌ ఫిలిం ల్యాబ్‌ వేదికగా యువకళావాహిని సినిమా, టెలివిజన్‌, మీడియా అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన కొణిజేటి రోశయ్య, సీనియర్‌ నటీమణులు జమున, గీతాంజలి, ఎల్వీ ప్రసాద్‌ ల్యాబ్‌ అధినేత అక్కినేని రమేశ్‌ ప్రసాద్‌ తదితరులు కలైమామణి, ప్రముఖ నటి షావుకారు జానకిని ‘యువకళావాహిని - ప్రైడ్‌ ఆఫ్‌ ఇండియన్‌ సినిమా అవార్డు’తో సత్కరించారు. అదే వేదికపై అలనాటి నటీమణులైన జానకి, జమున, గీతాంజలి ఒకరినొకరు హత్తుకొని, ప్రేమతో ముద్దాడుకొనే దృశ్యం సభికులకు ముచ్చటగొల్పింది. అనంతరం రోశయ్య మాట్లాడుతూ 87ఏళ్ల వయసులోనూ షావుకారు జానకి సినిమాల్లో నటించడం అరుదైన విషయంగా ప్రశంసించారు.

జమున మాట్లాడుతూ వైవిధ్యమైన పాత్రలు పోషించడంతోపాటూ జానకి నటనలో తమకు మార్గదర్శకురాలిగా నిలిచారని కొనియాడారు. సీనియర్‌ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, ప్రముఖ రచయిత్రి కేవీ కృష్ణకుమారి, సినీ నిర్మాత ఎన్‌ఆర్‌ అనురాధాదేవి తదితరులు ప్రముఖ ఛాయాగ్రాహకుడు ఎస్‌.గోపాలరెడ్డి, సంగీత దర్శకుడు జి.ఆనంద్‌కు ‘లైఫ్‌టైమ్‌ ఎచీవ్‌మెంట్‌’ అవార్డును అందించారు. ‘‘ఓ బేబీ’’ సినిమా మాటల రచయిత లక్ష్మీభూపాల్‌, మల్లేశం ఫేం అనన్య, ఆనంద చక్రపాణి, నటుడు జాకీ, నిర్మాత లోహిత్‌ లకు ఫిల్మ్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులతో సత్కరించారు. 

మీడియా అవార్డులు
పాత్రికేయ రంగంలో విశిష్ట సేవలు అందిస్తోన్న పలువురు జర్నలిస్టులను యువకళావాహిని సంస్థ సత్కరించింది. అందులో భాగంగా కొణిజేటి రోశయ్య ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి ఫీచర్స్‌ ఇన్‌చార్జి నేహారెడ్డికి మీడియా ఎక్స్‌లెన్సీ అవార్డును అందజేశారు. మీడియా అవార్డును అందుకున్న వారిలో బీబీసీ తెలుగు కరస్పాండెంట్‌ రూపవాణి కోనేరు, సీనియర్‌ జర్నలిస్టు యజ్ఞమూర్తితో పాటు యాంకర్‌ నేహా చౌదరి, క్రాంతి గుత్తికొండ, టి.సతీశ్‌ కుమార్‌, సూరజ్‌ వి. భరద్వాజ్‌, ఎస్‌.సత్యబాబు, జి.బాలకృష్ణ, సి.హరిప్రసాద్‌ ఉన్నారు. బుల్లితెర ధారావాహికల ద్వారా ప్రేక్షకులను మెప్పిస్తోన్న నటీనటులు శ్రీరామ్‌, సన, కెవ్వు కార్తీక్‌, చిన్నారి మాహీన్‌, ఆసం శ్రీనివాస్‌, ఐశ్వర్య, పవిత్రనాథ్‌ కార్తికేయ, అభిప్రతాప్‌, దర్శకుడు మలినేని రాధాకృష్ణ, గాయకుడు సాయి మధుకర్‌ తదితరులకు టెలివిజన్‌ ఎక్స్‌లెన్సీ అవార్డులను ప్రదానం చేశారు. సారిపల్లి కొండలరావు కార్యక్రమానికి అధ్యక్షత వహించారు. సభలో బండారు సుబ్బారావు, మహ్మద్‌ రఫీ, ఎస్వీ రామారావు, వైకే నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.