చిక్కడపల్లి, ఏప్రిల్‌18(ఆంధ్రజ్యోతి): కథానికాజీవి డా.వేదగిరి రాంబాబు అని వక్తలు పేర్కొన్నారు. ఎంవీ ఆర్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో గురువారం రాత్రి త్యాగరాయగానసభలో సుప్రసిద్ధ రచయిత, కథానికాజీవి డా.వేదగిరి రాంబాబు సాహిత్య వ్యక్తిత్వం, చైతన్యంపై ప్రసంగ కార్యక్రమం జరిగింది. ఈ సమావేశంలో సాహితీవేత్త విహారి, గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి, రచయిత్రి అత్తలూరి విజయలక్ష్మి తదితరులు పాల్గొని ప్రసంగించారు. వేదగిరి రాంబాబు  కథానిక కోసం ఎంతో కృషి చేశారన్నారు. కథానికా రచనలు చేయడంతోపాటు కథానిక రచయితలను ప్రోత్సహించారన్నా రు. కథానికా సదస్సులు నిర్వహించారని, ఊరూరా సదస్సులు నిర్వహించి ఈ సాహిత్యం కోసం ఎంతో తపించారన్నారు. చివరి వరకూ కథానిక కోసం ఆయన పడ్డ కృషి ఎంతో గొప్పదన్నారు. ఆయన వ్యక్తిత్వం కూడా ఎంతో గొప్పదన్నారు. ఈ సమావేశంలో ముఖ్య అతిథి విహారిని సన్మానించారు. రాంబాబు, రమణ తదితరులు పాల్గొన్నారు.