రవీంద్రభారతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): నిస్సహాయులకు సహాయం చేస్తూ, సమాజం హితం కోసం ప్రతి ఒక్కరూ పాటుపడాలని జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ అన్నారు. మనం బాగుండడంతో పాటు మన చుట్టూ ఉన్న వారు కూడా బాగుపడాలని కోరుకోవాలన్నారు. మంగళవారం తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సృజన సాంస్కృతిక, సాహిత్య సంస్థ ఆధ్వర్యంలో సృజన ఎక్స్‌లెన్సీ పురస్కారాల ప్రదానోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రముఖ సాహితీవేత్త కొలకలూరి ఇనాక్‌, ఆల్‌ ఇండియా రేడియో స్టేషన్‌ రిటైర్డ్‌ డైరెక్టర్‌ సత్తిరాజు శంకరనారాయణలకు జీవన సాఫల్య పురస్కారం ప్రదానం చేశారు. వివిధ రంగాల్లో నిష్ణాతులైన వి.విద్యాసాగర్‌, సునీల్‌, శివనాగేశ్వరరావు, కృష్ణభారతి, నటుడు బెనర్జీ, మృదులాంజలి ఆనంద్‌, బ్నింకు పురస్కారాలను అందజేశారు. అతిథిగా పాల్గొన్న జస్టిస్‌ అమర్‌నాథ్‌గౌడ్‌ పురస్కారగ్రహీతలను సత్కరించి అభినందించారు. సృజన సంస్థ అధినేత్రి అంజనాచౌదరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం స్పూర్తిదాయకమని అన్నారు.

పురస్కార గ్రహీత కొలకలూరి ఇనాక్‌ మాట్లాడుతూ అంజనాచౌదరి నిర్వహిస్తున్న సేవాకార్యక్రమాలు ఎనలేనివని కొనియాడారు. తనకు జీవన సాఫల్య పురస్కారం అందజేయడం సంతోషంగా ఉందన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ వివిధ రంగాల నుంచి సేవామూర్తులను ఎంపిక చేసి పురస్కారాలు అందజేయడం ఆనందకరమని అన్నారు. కార్యక్రమంలో ప్రాసిక్యూషన్‌ డైరెక్టర్‌ జి.వైజయంతి, మహ్మద్‌ రఫీ, అంజనా చౌదరి, రమ్యతేజ పాల్గొన్నారు. సభకు ముందు సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు.