కవిత్వాన్ని ఒక పాఠకుడు అనుభవించే క్రమాన్నీ, కవిత్వం కవిత్వమెలా అవుతుందనే బౌద్ధికతతో విమర్శకుడు దాని పొరలు విప్పే ప్రయత్నాన్నీ- గుంటూరు లక్ష్మీనరసయ్య ‘కవిత్వం చర్చనీయాంశాలు’ పుస్తకం వల్ల మరొక్కమారు దగ్గరగా చూసే వీలు కలుగు తుంది. అందుకు ఈ పుస్తకం ప్రశంసార్హమైనది. కవిత్వ నిర్మాణ పద్ధతుల్ని గురించి ఉద్దేశించిన అధ్యాయంలోని ఉదాహరణలు, వివరణ, వర్ధమాన కవులకి చాలా ఉప యోగంగా ఉంటాయి.

తాలులోంచి మేలిమి గింజల్ని వేరు చేయడమే సాహిత్య విమర్శ చేయగలిగిన విలువైన పని. లక్ష్మీనరసయ్య నేటి కవుల్లోని సంశయం, సందిగ్ధతలు ఏ గురీలేని నిహిలిజానికి దారితీస్తున్నాయని అభియోగం మోపుతాడు. అంతేకాకుండా: ‘‘యువ కవుల్లో పవర్‌ సెంటర్స్‌కు దగ్గరగా ఉండాలనే తపన లేనివాళ్ళు అతి తక్కువమందే. కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం కోసం పావులు కదిపేవాళ్ళు ఎక్కువైపోయారు’’ అంటాడు. యువకవుల్లో, విమర్శకుల్లో అప్పీజ్మెంట్‌ పాలిటిక్స్‌ లాగా అపీజ్మెంట్‌ పోయెట్రీ, అపీజ్మెంట్‌ విమర్శనా ధోరణి పెరిగిపోయాయంటాడు. అసలు లక్ష్మీనరసయ్య గారు ‘పవర్‌ సెంటర్స్‌’కి నిర్వచనం యిచ్చి, సదరు ‘ముఠాధిపతుల’ ఆధిపత్యానికి కారణాలేమిటో చెబితే ఈ విమర్శకు మరింత మేలు జరిగి ఉండేది. అందరూ అందరే కాదా? కాకారాయుళ్ళు, బాకాలూదేవాళ్ళు, ఉపదేశించిన ఆదర్శాలు తప్పి అకాడెమీ ప్రధాన పురస్కారా లందుకుంటున్నవాళ్ళు అన్ని కాలాల్లోనూ ఉన్నారు. సాహి త్యంపై యువ పురస్కార గ్రహీతల ప్రభావమూ, వాళ్ళ కొనసాగింపు- కొత్తగా రాసేవాళ్ళకి ప్రేరణనిచ్చే విషయాలు.

హృదయ సంపన్నత, జీవన వైవిధ్యం, నిజాయితీ లాంటి ఎన్నో లక్షణాలకు ఈ తరం నిలువుటద్దంలా ఉన్నది. ఈ తరాన్ని చూసేవాళ్ళ కళ్ళద్దాలు మసకబారి ఉన్నాయంటే కోపం రాకూడదు.భావజాలానికి సామీప్యమున్నప్పుడు ఆ సంఘర్షణాత్మక కవిత్వాంశంతో మమేకమయినదానికీ, లేనప్పుడు సాఫీగా దగ్గర కావడానికీ విభజన రేఖ ఉండి తీరుతుంది. అది వస్తు శిల్పాలగానో, మరింకేంగానో వేరు వేరుగా ఉన్నప్పటికీ కేవలం ఆస్వాదనచేత ‘ఉన్నత స్థాయి’ అనిపించుకోదు. ఎందుకంటే లక్ష్మీనరసయ్యే మనిషి సాదకబాధలతో నిమిత్తంలేని ఉత్తమ కవిత్వం ఉండజాలదంటాడు. రంజింపజేయడానికీ, కదిలించే దానికీ ఒక క్రైటీరియా ఉందంటాడు. కనుకనే ప్రతీ కవి లోనూ ఉత్త కవిత, ఉత్తమ కవిత రెండూ ఉంటాయని ఆయన అంటే ఒప్పుకుంటాం. అందరికీ చెందిన కవిత్వం ఉండదంటే ‘నిజమే’ కదా అంటాం. సమస్యేమిటంటే కవి భావజాలంతో నిమిత్తం లేకుండా కవిత్వాన్ని ఆస్వాదించ వచ్చునంటాడు.

అఫ్సర్‌ మల్టిప్లిసిటీని, సీతారాం అంతర్ము ఖత్వాన్ని, కృష్ణశాస్త్రి ఎస్కేపిజాన్నీ, మో లోని విషాదాన్ని, ఇస్మాయిల్‌ యథాతథవాదాన్ని ఆయా కవులు స్థిరపరచిన ప్రమాణాలకతీతంగా సహృదయతతో మాత్రమే ఇష్టపడ్డం జరుగలేదు. నిర్దిష్టతకి ‘అనేకత’ వర్తించదని పుస్తక రచయితే వివరించడం మరువకూడనిది.సహజంగా అవ్యవధానమూ, ఉద్రేకపూరితంగానూ ఉండే ఫేస్బుక్‌ కేంద్రకంగా వొచ్చినప్పటికీ ఈ వ్యాసాల్లో- గాలివాటు వ్యాఖ్యలుండవు. పిడివాదమూ లేదు. అవి నచ్చుతాయి. ‘‘అభ్యుదయ కవిత్వానికి చెందినంతవరకూ శ్రీశ్రీ రారాజు. విప్లవ కవిత్వానికి శ్రీశ్రీతో సహా ఎవరూ ఇప్పటివరకూ అందుకోలేని స్థాయిని శివసాగర్‌ కైవసం చేసుకున్నాడు’’ లాంటి మాటలు ఆలోచనలో పడవేస్తాయి. ఈ పుస్తకంలో విప్లవ కవిత్వంపై అవకాశం దొరికినప్పుడల్లా విమర్శలు చేసిన లక్ష్మీనరసయ్య శివసాగర్‌ ప్రస్తావనలో మాత్రం (దళిత కవిత్వం రాశాడు కనుక) ఆదరం చూపిస్తాడు. శివసాగర్‌పై అతిశయోక్తుల్లేని ప్రశంసలు సహేతుకమని పించినా- మరి పాఠకలోకం శ్రీశ్రీని మాత్రమే మహాకవి అని, శివసాగర్‌ని ఎందుకనలేదో తేల్చలేకపోతాడు.