చిక్కడపల్లి, ఏప్రిల్‌19(ఆంధ్రజ్యోతి): కళాధర్‌ మైమ్‌ అకాడమీ బాలసాహిత్య పరిషత్‌, త్యాగరాయగానసభల ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి గానసభలో మూకాభినయం కళపై తెలుగులో  మైమ్‌ కళాధర్‌ రచించిన తొలి సమగ్ర గ్రంథం మూకాభినయం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ గ్రంథాలయ పరిషత్‌ అధ్యక్షుడు డా. అయాచితం శ్రీధర్‌ పుస్తకాన్ని ఆవిష్కరించి మాట్లాడుతూ 24 గంటలపాటు నిర్విరామ మూకాభినయం ప్రదర్శించి ప్రపంచరికార్డు సృష్టించడంతోపాటు దేశవిదేశాల్లో వేలాది ప్రదర్శనలిచ్చి ప్రముఖుల ప్రశంసలు అందుకుని ఇండియన్‌ మిస్టర్‌ బీన్‌గా ప్రఖ్యాతుడైన మైమ్‌ కళాధర్‌ తన అనుభవాన్ని రంగరించి ఈ పుస్తకం రాశారన్నారు. మూకాభినయం కళపై తెలుగులో తొలి సమగ్రగ్రంథం రావడం ఎంతో ఉపయోగమన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీ బాలసాహిత్య పురస్కార గ్రహీత చొక్కాపు వెంకటరమణ అధ్యక్షతన జరిగిన ఈ సభలో  కళా జనార్దనమూర్తి, కోట్ల హనుమంతరావు, డా. వంశీ రామరాజు, మహ్మద్‌రఫీ కిన్నెర రఘురామ్‌, రామడుగు వసంత్‌ పాల్గొన్నారు.కాపర్తి నాగేష్‌, మెజీషియన్‌ కాజా, కరుణాకర్‌ బృందం మూకాభినయం  అలరించింది.