కరీంనగర్‌కల్చరల్‌, జనవరి 25: కరీంనగర్‌ జిల్లాకు చెందిన ప్రముఖ సంస్కృత పండితుడు శ్రీభాష్యం విజయసారధికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించింది. ఉమ్మడి కరీంనగరం జిల్లాలోని చేగుర్తి అనే గ్రామంలో గోపమాంబ, నరసింహాచార్య దంపతులకు విజయసారధి జన్మించారు. తల్లి బోధించిన తిరుప్పావైని శ్రీవ్రతమ్‌ అనే పేరుతో రాగతాళయుక్తంగా పాడుకోవడానికి అనువుగా ఏడేళ్ల వయసులోనే సంస్కృతీకరించారు. బాసరలో అమ్మవారిని ఉద్దేశించి రాసిన శ్లోకం శ్రీవిశ్వేశ్వర సంస్కృతాంధ్ర కళాశాలకు ప్రార్థన శ్లోకంగా మారింది. గంగావతరణ ఘట్టాన్ని రేఖామాత్రంగా స్వీకరించి..మందాకిని కావ్యాన్ని రాశారు. ఆయన సాహిత్యంలో చేపట్టని ప్రక్రియ లేదు. సంస్కృత సాహిత్యంలో సీసం లాంటి చందస్సును ప్రవేశపెట్టిన సృజనకారులు. వేదాలలోని సూక్త ప్రక్రియను వర్తమాన సమాజ చిత్రణకు ఉపయోగించిన ప్రయోగశీలి ఆయన. కవిగా పేరొందిన వీరు విమర్శనారంగంలో కూడా అనన్య సామాన్యకృషి చేశారు. సంస్కృత రూపకాల్లో నాందిప్రస్తావనలు, సంస్కృత వసు చరిత్ర సమీక్ష, న్యాయవైశేషికాలు, సాంఖ్యాయోగాలు వంటి గొప్ప సాహిత్య సృజన సంస్కృతంలో చేసిన ఆయన శతాధిక గ్రంథకర్త.