చిక్కడపల్లి, జూన్‌ 25(ఆంధ్రజ్యోతి): రసమయి సంస్థ ఆధ్వర్యంలో డాక్టర్‌ పైడి లక్ష్మయ్య, డాక్టర్‌ పీఎల్‌ సంజీవరెడ్డిల స్మారక ప్రతిభా పురస్కారాల ప్రదానసభ నిర్వహించారు. మంగళవారం రాత్రి త్యాగరాయ గానసభలో జరిగిన కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి డాక్టర్‌ కొణిజేటి రోశయ్య ముఖ్య అతిథిగా పాల్గొని ప్రతిభా పురస్కారాలను బహూకరించారు. ఈ సందర్భంగా ద్రవిడ విశ్వవిద్యాలయం పూర్వ వీసీ ఆచార్య రవ్వా శ్రీహరి, సీనియర్‌ పాత్రికేయుడు గుడిపూడి శ్రీహరి, ప్రముఖులు రచయిత్రి డి.కామేశ్వరి, పౌరాణిక పద్యనాటక కళాకారుడు ఎ.వెంకటేశ్వరరావులకు పురస్కారాలు ప్రదానం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ పూర్వ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్‌ సభను ప్రారంభించి మాట్లాడుతూ బహుభాషా పండితుడు, విజ్ఞానవేత్త పైడి లక్ష్మయ్య అని అన్నారు. ఎంపీగా పనిచేసిన పైడి లక్ష్మయ్యను తదనంతర కాలంలో దేవాదాయ కమిషనర్‌గా నీలం సంజీవరెడ్డి నియమించారన్నారు. లక్ష్మయ్య శ్రీశైలం ఘాట్‌ రోడ్డు నిర్మాణం, ఆంధ్రదేశంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేయడంలో ఎంతో కృషి చేశారన్నారు. నాటక రచయిత కూడా అయిన ఆయన మాజీ ప్రధాని నెహ్రూకు సన్నిహితంగా ఉండేవారన్నారు. రాజకీయ నాయకుడిగా, అధికారిగా లక్ష్మయ్య ఎంతో పేరు గడించారన్నారు.

సమర్థుడైన ఉన్నతాధికారిగా పీఎల్‌ సంజీవరెడ్డి పనిచేశారన్నారు. ప్రభుత్వ సలహాదారు డాక్టర్‌ కేవీ రమణాచారి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రిటైర్డ్‌ డీజీపీ రొడ్డం ప్రభాకర్‌రావు, నిర్వాహకుడు ఎంకే రాము, ఎంకేఆర్‌ ఆశాలత తదితరులు పాల్గొన్నారు. అనంతరం ‘గయోపాఖ్యానం’ నాటక ప్రదర్శన ఆకట్టుకుంది.