• రవీంద్రభారతిలో 9రోజులపాటు నిర్వహణ

రవీంద్రభారతి/హైదరాబాద్‌, నవంబర్‌ 20 (ఆంధ్రజ్యోతి): సాహితీ ప్రియులకు కన్నుల పండుగ.. వీనుల విందు! మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి, విశ్వనాథ సత్యనారాయణ, గుర్రం జాషువా, దాశరథి, పుట్టపర్తి నారాయణచార్యులు వంటి గొప్ప కవుల కలాల నుంచి జాలువారిన పద్యాలను రాగయుక్తంగా వినే భాగ్యం. రవీంద్రభారతి వేదికగా తొమ్మిది రోజుల పాటు కిన్నెర ఆర్ట్స్‌ థియేటర్స్‌ ఆధ్వర్యంలో ‘పద్య నాటకోత్సవం’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. వివరాలను ప్రభుత్వ సలహాదారు రమణాచారి తన కార్యాలయంలో వెల్లడించారు. శుక్రవారం నుంచి 30వ తేదీ వరకు ప్రతిరోజు సాయంత్రం పద్యనాటకాలను ప్రదర్శిస్తారన్నారు. కిన్నెర సంస్థ కార్యదర్శి రఘురాం మాట్లాడుతూ ఉత్సవాలను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివా్‌సగౌడ్‌ ప్రారంభిస్తారన్నారు.