హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): సుప్రసిద్ధ కవి, పండితుడు, సాహిత్య విమర్శకుడు, వ్యాఖ్యాత, అనువాదకుడు అయిన డాక్టర్ అద్దంకి శ్రీనివాస్‌కు రాష్ట్రపతి పురస్కారం లభించింది. 2019 సంవత్సరానికి గానూ ‘మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్’ పేరిట ఇచ్చే రాష్ట్రపతి పురస్కారానికి ఆయన ఎంపికయ్యారు. ఆగస్టు 15 సందర్భంగా ఆ అవార్డును రాష్ట్రపతి చేతుల మీదుగా స్వీకరించారు. సంస్కృత, పర్షియన్, అరబిక్, పాళీ, ప్రాకృత్, కన్నడ, తెలుగు, మళయాళం, ఒడియా భాషల్లో ప్రసిద్ధి చెందిన సాహిత్య ప్రముఖులకు ‘మహర్షి బాదరాయణ్ వ్యాస్ సమ్మాన్’ అవార్డును ప్రతియేటా అందజేస్తుంటారు. తెలుగు నుంచి అద్దంకి శ్రీనివాస్‌కు ఈ అవార్డును ప్రదానం చేశారు. 

ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరంలో 1975వ సంవత్సరం జూన్ 11న జన్మించిన అద్దంకి శ్రీనివాస్‌కు చిన్నతనం నుంచే సాహిత్యం అంటే అమితమైన ప్రీతి. ఇంట్లోనూ సాహిత్య వాతావరణమే ఉండటం ఆయనకు మరింతగా కలిసొచ్చింది. కవిగా కథకుడిగా, విమర్శకుడిగా, గేయ రచయితగా, వ్యాసకర్తగా, అనువాదకుడిగా, నిఘుంటుకర్తగా, వ్యాఖ్యాతగా, వక్తగా, కాలమిస్టుగా.. ఇలా బహుముఖ పాత్రలెన్నింటినో ఆయన పోషించారు. అనేక పత్రికల్లోనూ, జాతీయ అంతర్జాతీయ వేదికలపైనా వీరు ప్రసంగించి ఎందరో సాహిత్య ప్రియుల మనసును గెలుచుకున్నారు. ఇంటర్మీడియట్‌లో ఉండగానే పద్యాలను రాయడం నేర్చుకున్నారాయన.. ఆ కాలంలోనే ‘విద్వత్ర్పతీకగా పద్యం పరుగెత్తాలి’ అంటూ రాసిన వ్యాసం ఓ ప్రధాన పత్రికలో ప్రచురితమయింది. ఆచార్య నాగార్జున యూనివర్శిటీ నుంచి ఎంఏ భాషా శాస్త్రం, శ్రీ వెంకటేశ్వర యూనివర్శిటీ నుంచి ఎంఏ సంస్కృతం, ఆంధ్రా యూనివర్శిటీ నుంచి తెలుగులో పీహెచ్‌డీ చేశారు. 
 
ఐఐఐటీ, ఆర్జీయూకేటీ విద్యార్థులకు భాషా శాస్త్రం, అనువాదం, సాహిత్య చరిత్ర మొదలైన అంశాలపై వీడియో పాఠాలను  అద్దంకి శ్రీనివాస్‌ చెప్పేవారు. పంచతంత్ర కథలకు సరళీకరణగా ఆయన రచించిన ‘బాల నీతి చంద్రిక’ విద్యా పాఠ్య ప్రణాళికలో ఉపవాచకంగా స్థానం సంపాదించింది. బాలల వాల్మీకి రామాయణము, బాలల భారతము, బాలల భాగవతం వంటి గ్రంథాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పారిజాతాపహరణం, శ్రీకాళహస్తిమహాత్మ్యం, చారుచర్య, విజ్ఞానేశ్వరం, కంకంటి పాపరాజు ఉత్తర రామాయణం, తెలుగులో అనువాద విధానం, తెలుగు సాహిత్యంలో రామానుజ వైభవం వంటి పుస్తకాలు విశేష ఆదరణ పొందాయి. వాల్మికీ రామాయణం, పోతన భాగవతం, గీతార్థసంగ్రహం వంటి వచన రచనలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఐఏఎస్ పోటీ పరీక్షల కోసం ఆర్సీ.రెడ్డి తెలంగాణా స్టడీ సర్కిల్‌లో తెలుగు విద్యార్థులకు శిక్షణ కూడా ఆయన ఇచ్చేవారు. శ్రీశ్రీశ్రీ చినజీయర్ స్వామి ఆధ్వర్యంలో నడిచే భక్తి నివేదన పత్రికకు సంపాదకులుగా ఆయన ప్రస్తుతం పనిచేస్తున్నారు. టీటీడీ శ్రీవారి బ్రహ్మోత్సవాలు, పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాలు, అన్నవరం, భద్రాచలం, మైసూర్, ఒంటిమిట్టలలో జరిగే స్వామి వారి కళ్యాణాలకు ప్రత్యక్ష వ్యాఖ్యానం చేసేవారు. ఆకాశవాణి, ఎస్వీబీసీ, డీడీ, భక్తి, వంటి పలు చానెళ్లలో ఆయన ప్రసంగాలు ప్రసారమవుతుంటాయి. 
 
ఎమ్ఏ తెలుగులో అద్దంకి శ్రీనివాస్‌‌కు ఏకంగా తొమ్మిది బంగారు పతకాలు వచ్చాయి. 25కు పైగా ఉత్తమ కవి, సాహితీ వేత్త పురస్కారాలను ఆయన అందుకున్నారు. రంజని కుందుర్తి పురస్కారం, ఎక్స్‌రే పురస్కారం, సహృదయ సాహితీ పురస్కారం, 2007 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే ఉత్తమ కవి, ఉత్తమ రచయిత పురస్కారం, సాహిత్య కౌముది ప్రతిభా పురస్కారం, జనరంజక కవితా పురస్కారాలను ఆయన్ను వరించాయి. నవభారత రత్న, వేగావతీ భారతి అవార్డులు కూడా ఆయనకు వచ్చాయి.