ఆయన పేరు వింటే సంగీతమే పులకరించిపోతుంది. ఆయన పాడుతూంటే సాహిత్యం గుండె లోతులను తడుతుంది. ఆ సంగీత సామ్రాట్‌ మంగళంపల్లి బాలమురళీ కృష్ణ. సంగీతమంటే ఆయనకు అమితాసక్తి. అందుకే చిన్నతనం నుంచే సంగీత సాధన చేసేవారు. తొలుత కొచ్చర్ల కోరు రామరాజు దగ్గర సంగీత స్వరాలు నేర్చుకున్నారు. తరువాత పక్షి తీర్థానికి చెందిన సుబ్రహ్మణ్యం, ఆ తరువాత పెద్ద కళ్లేపల్లిలో సుసర్ల దక్షిణామూర్తి వద్ద సంగీత శిక్షణ పొందారు. ఆపై పారుపల్లి రామకృష్ణయ్య పంతులు వద్ద సంగీతంలో మెళకువలు నేర్చుకున్నారు. ఈ గురువు ఆరాధనోత్సవాల సందర్భంగా 1938లో తన 8వ ఏటనే బాలమురళి తొలి సంగీత కచ్చేరి చేసి ‘బాల మేధావి’గా ప్రశంసలు పొందారు.

 
ఆయన గానానికి మురిసిపోయిన ప్రముఖ సంగీత విద్వాంసులు ముసునూరి సత్యనారాయణ మురళి పేరుకు ముందు ‘బాల’ అని చేర్చారు. ఆ పేరుతోనే ఆయన ప్రసిద్ధుడవడం విశేషం. చాలాకాలం విజయవాడ సత్యనారాయణ పురంలో స్థిరపడ్డారు. ఆ వీధి ఆయన పేరుతోనే ‘బాల మురళి వీధి’గా పేరుపొందింది. తన 9వ ఏట నుండే ప్రొఫెషనల్‌ కచ్చేరీలు ఇవ్వడం మొదలు పెట్టారు. సంగీతంతో పాటు వయోలిన్‌, మృదంగం, కంజీర వంటి వాయిద్యాలన్నింటిలోనూ అద్భుతమైన ప్రతిభను కనబరిచేవారు. ఆయనకు ఉద్యోగం చేయాలన్న కోరిక ఉండేది. కానీ, చదువు రాకపోవడంతో ఆ అవకాశం లభించలేదు. మద్రాసు ఆలిండియా రేడియో కేంద్రం ప్రారంభోత్సవంలో కీర్తనలు ఆలపించి విశిష్ట గుర్తింపును అందుకున్నారు. తరువాత ప్రారంభమైన విజయవాడ రేడియో స్టేషన్‌ డైరెక్టర్‌ అయ్యగారి వీరభద్రరావు దగ్గరకెళ్లి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని అభ్యర్థించారు.
 
బాలమురళి ప్రతిభకు అబ్బురపడి మరుసటి రోజే పిలిచి రూ.250 జీతంతో మ్యూజిక్‌ సూపర్‌వైజర్‌ పోస్టు ఇచ్చారు. అయితే, తండ్రి పట్టుదలతో విజయవాడ మునిసిపల్‌ స్కూల్లో ఆరో తరగతిలో వేశారు. ఓ కచ్చేరీలో ఒక ఇంగ్లీష్‌ వ్యక్తి వచ్చి ‘ఏం పాడుతున్నావు?’ అని ఇంగ్లీషులో అడిగేటప్పటికి అర్థం కాక సమాధానం చెప్పలేకపోయాడు. ఆమె ఈసడింపుగా చూసింది. దాంతో ఆయనలో కసి పెరిగింది. ఒక మాస్టార్ని పెట్టుకుని ఇంగ్లీషు నేర్చుకున్నారు. ఆరు నెలల తరువాత రోటరీ క్లబ్‌ మీటింగులో ఇంగ్లీషులో అనర్గళంగా స్పీచ్‌ ఇచ్చారు. ఆ విధంగా సంగీత సాధన చేస్తూనే చదువులూ ఒంటబట్టించుకున్నారు. తరువాతి కాలంలో విదేశాల్లోనూ కచేరీలు ఇస్తూ, ఇంగ్లీషులోనే మాట్లాడేవారు.