ఏ విషయమైనా పిల్లలకు అర్థమయ్యే భాషలో చెబితేనే వారి మనసులో బలంగా నాటుకుంటుంది. పిల్లల మనస్తత్వాన్ని చదివి, పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో పుస్తకాలుగా తెచ్చారు బెంగళూరుకు చెందిన రూపా పాయ్‌. అంతేకాదు పురాణాలు, వేదాల్లోని మంచిని పెద్దలతో పాటు పిల్లలకు తెలియజెప్పాలనే సంకల్పంతో ‘భగవద్గీత, ఉపనిషత్తుల’ మీద పిల్లల భాషలో పుస్తకాలు రాశారు కూడా. పిల్లల పుస్తకాల రచయిత్రిగా 26 ఏళ్ల అనుభవమున్న ఆమె విశేషాలివి...

‘‘మాది బెంగళూరు. కంప్యూటర్‌ ఇంజనీరింగ్‌ చదివాను. ఐఐటీ గ్రాడ్యుయేట్‌ను పెళ్లి చేసుకున్నా. మాకు ఇద్దరు పిల్లలు. మావారి ఉద్యోగరిత్యా పలు ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చింది. ఢిల్లీ, ముంబయిలతో పాటు న్యూయార్క్‌, లండన్‌, ఒర్లాండో లాంటి నగరాలు తిరిగొచ్చా.
 
నేను యవ్వనంలో ఉన్నప్పుడు భగవద్గీత, వేదాలు, ఉపనిషత్తుల మీద పట్టు పెంచుకోవాలనీ, వాటి మీద పుస్తకాలు రాయాలనీ అనుకునేదాన్ని. అయితే పెళ్లి, పిల్లలు, కుటుంబ బాధ్యతల కారణంగా సాధ్యపడలేదు. ఇప్పుడు సమయం చిక్కడంతో నా అభిరుచి అయిన పుస్తకరచన మీద దృష్టి సారించాను. ఇప్పుడు నాకు 48ఏళ్లు.
పుస్తకాలతో గడిచిన బాల్యం నాది...
 
బాల్యంలో బ్రిటన్‌కు చెందిన చిల్డ్రన్‌ బుక్స్‌ రచయిత ఎనిండ్‌ బ్లైటన్‌ పుస్తకాలు చదువుతూ పెరిగా. బ్రిటన్‌లోని పిల్లలు, నేను మాత్రమే బాల్యాన్ని చక్కగా ఆస్వాదిస్తున్నామని అనుకునేదాన్ని. ఆ తరువాత మనదేశంలో ఇంగ్లీష్‌లో ప్రింట్‌ అయ్యే పిల్లల మ్యాగజైన్‌ ‘టార్గెట్‌’ చదివా. ఆ మ్యాగజైన్‌ నాకు ఎంతగానో నచ్చింది. వాటిలోని కథలు చదివి ఈ విశ్వానికి సమాంతంరంగా మరొక ప్రపంచాన్ని సృష్టించాలని, అది కూడా భారతీయ పిల్లలకు సంబంధించినదై ఉండాలని.. ఇలా రకరకాలుగా భావించేదాన్ని.
 
ఆమె ప్రోత్సాహంతోనే....
అయితే నన్ను పిల్లల పుస్తకాలు రచన వైపు మళ్లించింది మాత్రం వత్సల కౌల్‌. ‘హ్యాచెట్‌’ మ్యాగజైన్‌కు ఎడిటర్‌గా ఉన్నారామె. నాకు చిల్డ్రన్‌ బుక్స్‌ మీదున్న ఆసక్తిని గమనించిన ఆమె పిల్లల కోసం పదేళ్ల క్రితం సైన్స్‌ ఫిక్షన్‌ బొమ్మలతో కూడిన ఎనిమిది పుస్తకాల సిరీస్‌ ‘తారానాట్స్‌’ రాసేందుకు నన్ను ఒప్పించారు. ఆ ప్రాజెక్ట్‌ పూర్తిచేయడానికి నాకు నాలుగేళ్లు పట్టింది. అదే ఉత్సాహంతో 2014లో ‘వాట్‌ ఇఫ్‌ ఎర్త్‌ స్టాప్డ్‌ స్పిన్నింగ్‌’ పుస్తకం తెచ్చాను. ఆ బుక్‌ చూసి సైన్స్‌ బుక్స్‌ రాశావు సరే. మరి భగవద్గీత, వేదాల మాటేమిటి? అని ప్రశ్నించింది. అందుకు నేను ‘పిల్లలకు భగవద్గీత అవసరమని ఎవరు చెప్పారు? అందులో పిల్లలు తెలుసుకోదగ్గవి ఏం ఉన్నాయి?’అని అడిగాను. దాంతో ఆమె నన్ను తన కోసం భగవద్గీత కాపీని తెమ్మని అడిగారు.