పనే ముఖ్యం అన్న వాళ్ళకి ప్రచారం పట్టదు. ప్రచారం కోసం చేసే వాళ్లకు పనితో పని లేదు. ‘వెలుగు’ రామినాయుడు పనిమంతుడు. నిశ్చల బలోన్నతుడు. ఎంతటి కార్యాన్నైనా తా చక్కగా ఒనర్చగల కార్యకర్త. సాహిత్యమే శ్వాసగా జీవిస్తున్నవాడు. కాళ్లకు సహజ చక్రాలతో పుట్టిన సంచారి. దరిదాపుల్లో ఎక్కడ సాహిత్య సభ జరుగుతున్నట్టు తెలిసినా ఆహ్వానంతో నిమిత్తం లేకుండా హాజరయ్యే సాహిత్య పిపాసి. అంతేనా...? తన పాటతో సభను పరిపూర్ణం చేసే వాడు. అప్పుడప్పుడు కంట్రీ లైఫ్‌ మీద మాత్రమే కవిత్వం రాసే దేశి కవి. ఆయన అంతరంగం ఇది.
 
గురజాడ, ఠాగూర్‌ ఇద్దరూ ఈడు జోడు వారే. ఇద్దరూ ఇద్దరే. 150 ఏళ్ల ఠాగూర్‌ ఊరేగింపు కార్యక్రమంలో కలకత్తా వీధుల్లో ప్లకార్డు పట్టుకుని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి ముందు నిలబడింది. గురజాడకి ఆ గౌరవం దక్కిందా? మరి మనం జయంతులు వర్ధంతులు జరిపి ఏం లాభం? ఏలిన వారికి ఉండాలి కదా?
 
మీ గురించి చెప్పండి నాయుడు గారు?
చెప్పుకోవడానికి ఏమీ లేదు సాహితీవేత్తను కాను, కార్య కర్తను మాత్రమే. పుట్టింది వ్యవసాయ కుటుంబంలో. శ్రీకా కుళం జిల్లా రాజాం దగ్గర పొనుగోటి వలస. రైల్వే విద్యుత్‌ శాఖలో చిరుద్యోగం. కథలు కాకరకాయలు రాసే సాహితీ సేవ చేయనక్కర్లేదు కదా, ఆ కార్యక్రమానికి ఒక వేదిక ఏర్పాటు చేయడం కూడా సేవే అని ‘వెలుగు’ను ప్రారంభించాం.
 
‘వెలుగు’ ఆరంభం ఎప్పుడు?
చిరుదీపం వెలిగించాలనే సదాశయంతో నాలుగు దశా బ్దాల క్రితం చాసో గౌరవ అధ్యక్షుడిగా విజయనగరం రైల్వే కాలనీలో ‘వెలుగు’ ప్రారంభమైంది. ఆదిలోనే అది కొడిగట్టి పోకుండా నా సహోద్యోగులు సహకరించారు- గోరంత దీపం కొండంత వెలుగు అనే ఆశతో. శీలా వీర్రాజు గారు వెలుగు ఆశయాన్ని ప్రతిబింబిస్తూ మంచి లోగో చిత్రించారు. నాటి నుంచి నేటి వరకు గురజాడ అడుగుజాడను ఆదర్శంగా తీసుకుని తన పయనాన్ని కొనసాగిస్తూనే ఉంది.
 
నడిచొచ్చిన నాలుగు దశాబ్దాల వెలుగుబాట గురించి?

‘వెలుగు’ ఒక సాహితీ సాంస్కృతిక సంస్థ. సాహిత్య కార్యక్రమాలకు పెద్దపీట వేసినా మిగతా లలిత కళలకు సంబంధించిన చాలా కార్యక్రమాలు చేసింది. అసలు వెలుగు తన ఆరంభ కార్యక్రమమే తిరుపతి గోపాలకృష్ణగారి వయొ లిన్‌ కచేరీతో ప్రారంభమైంది. ఆధునిక సాహిత్యంలో వివిధ వాదాల మీద, ధోరణుల మీద, మాండలిక, జానపద, బాల సాహిత్యాల మీద ప్రముఖులతో ప్రసంగాలు చేయించింది. 

దీపధారులనదగ్గ సాహితీమూర్తుల కృషి మీద ప్రముఖులు వచ్చి ప్రత్యేక ప్రసంగాలు చేశారు. చిత్రకళా పోటీలు, పాటల పోటీలు, జానపద కళారూపాల ప్రదర్శనలు, వీటితో పాటు ఆయా సందర్భాల్లో విద్యార్థులకు అనేక అంశాలపై పోటీలు నిర్వహించడం... నెల నెలా తప్పనిసరిగా ఈ కార్యక్రమాలు జరుగుతుండేవి. స్ట్రీట్‌ ప్లే ఒక ప్రధాన కళారూపంగా వీధి లోకి వచ్చినప్పుడు దాన్ని విజయ నగర వీధుల్లో ఏర్పాటు చేశాం. గంటి వెంకటరావు దర్శకత్వంలో కొక్కొరోకో నాటకం రైల్వేస్టేషన్‌, ప్రకాశం పార్క్‌, కోట జంక్షన్‌ ఇలా జన సమ్మర్ధం గల చోట్ల ప్రదర్శన ఏర్పాటు చేశాం. అదేవిధంగా ప్రొఫెసర్‌ కృష్ణరావుగారి రచన దర్శకత్వంలో ‘జంతర్‌ మంతర్‌ మామ్మూళ్లు’, రాజ్‌కుమార్‌, జొన్నలగడ్డ దర్శకత్వంలో ‘అరణ్య పర్వం’, ‘కుక్క’ ప్రదర్శనలు ప్రేక్షకుల మెప్పు పొందాయి. ముఖ్యంగా గోపాల్రాజు రచించిన ‘రాయి’ నాటిక గంట సత్య నారాయణ దర్శకత్వంలో మొదటి ప్రదర్శన ‘వెలుగు’ ఆధ్వ ర్యంలోనే జరిగింది. ఆ తర్వాత ఆ నాటిక విశేష ప్రాచుర్యం పొందిన సంగతి తెలిసిందే.

 
రైల్వే రచయితలతో సదస్సు నిర్వహించినట్టున్నారు?
1987 జనవరిలో ఆ సభ నిర్వహించాం. రైల్వే శాఖలో పని చేస్తున్న రచయితలందరినీ ఒక చోట చేర్చాలని అని పించింది. పురాణం, ఘండికోట, అల్లం శేషగిరిరావు, ఎర్రం శెట్టి సాయి, నిర్మలానంద ఇలా చాలామంది వచ్చారు. జీవిక కోసం ఉద్యోగమైనా అందులో సాధకబాధకాలను కథనం చేయడం కూడా గొప్ప విషయమే కదా. ఆ రోజు అలాంటి విషయాలు చాలా చర్చకు వచ్చాయి.
 
‘వెలుగు’ చేపట్టిన మిగతా కార్యక్రమాలు?
‘వెలుగు’ కేవలం సాహిత్య సాంస్కృతిక కార్యక్రమాలకే పరిమితం కాలేదు. సమాజంలో ఏ రకమైన అమానుష మైన సంఘటన జరిగినా దానికి తప్పక స్పందించేది. రాజ స్థాన్‌లో రూప్‌కన్వర్‌ సతి సంఘటన జరిగినప్పుడు విజయ నగరంలో నాలుగు వందల మంది కళాశాల విద్యార్థులతో ఊరేగింపు జరిపాం. ఇరాక్‌ మీద అమెరికా దాడికి అదే పద్ధతిలో నిరసన తెలియజేసాం.
 
గురజాడపై చాలా కార్యక్రమాలు నిర్వహించారు...
అవును.. యావత్‌ సాహితీ ప్రపంచం విజయనగరం వైపు చూసే విధంగా ‘నూరేళ్ళ కన్యాశుల్కం’, ‘మూడు ఏభయ్యల గురజాడ’, ‘నువ్వు లేని నూరేళ్లు’, ఈ మూడు కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. సాలు పొడుగునా నిరాటంకంగా నెలలపాటు సాహితీ ప్రముఖుల ప్రసంగాలతో విజయనగరం ఒక సాహితీ సంబరం చేసుకున్న సందర్భం అది. ఆగస్టు 1991 నుంచీ ఆగస్టు 1992 వరకు ఈ సభలు జరిగాయి.
అంటే అతిశయోక్తి గా ఉండొచ్చు గానీ ఇది ముమ్మాటికీ నిజం. అంతవరకు గురజాడ ఇల్లు ఎక్కడుందో లోకానికి తెలియదు. ఎవరూ పట్టించుకున్నది లేదు. దాన్ని వెలుగు లోకి తీసుకు వచ్చింది మాత్రం వెలుగే. ‘‘ఓసారి ఇటు చూడండి రా నాయనా! ఇది మన మహాకవి ఇల్లు రా’’ అని ప్రజల, ప్రభుత్వం దృష్టిని అటు మరల్చేటట్టు చేసింది. విన్నపాలు వినవలె అంటూ, పెద్దల వెంట, అధికారుల వెంట పడడం వల్ల కేంద్ర గ్రంథాలయం గురజాడ స్మారక కేంద్రం గ్రంథాలయంగా, అక్కడ గురజాడ విగ్రహం, అక్కడ వీధికి గురజాడ పేరు దఖలుపడ్డాయి. 1988 నవంబర్‌ 30న వెలుగు నిర్వహించిన గురజాడ వర్ధంతి సభలో నాటి రాష్ట్రమంత్రి అశోక గజపతి రాజుగారు గురజాడ గృహాన్ని ప్రజాపరం చేస్తున్నట్టు ప్రకటించారు. ఇప్పుడది సమాచార శాఖ ఆధ్వర్యంలో ఉంది. చిన్న గ్రంథా లయం నడుస్తోంది. ఆ ఇంట్లో గురజాడ చదివిన పుస్త కాలు వాడిన వస్తువులు ఉన్నాయి. వీటిని పదిల పరచ డంలో వెలుగుతోపాటు ధాతారావు గారు, గురజాడ వార సులు ఎంతో సహకరించారు. వీటన్నిటిని కొలిక్కి తేవడంలో నాటి డిపిఆర్‌ఓ నారాయణ రావు గారి కృషి ఎంతో ఉంది.
 
అదిగో అప్పుడే కన్యాశుల్కం నూరేళ్ల పండుగకు సమా లోచన చేసింది. రమణ రాజా, చాసో, శేష సాయి వంటి పెద్దలతో ఒక సారథ్య సంఘం ఏర్పాటయింది ఏడాది పొడుగునా సాహిత్య సభలు జరిగాయి. ఆ సందర్భంలోనే రావిశాస్త్రి, వివి, చలసాని, జ్వాలాముఖి, కృష్ణాబాయి, చేరా, కారా, కేతవరపు, కెవిఆర్‌, హరి, శివారెడ్డి, పూసపాటి కృష్ణం రాజు, వావిలాల, పరకాల, సోమంచి యజ్ఞశాస్త్రి, కూరెళ్ళ వెంకటశాస్త్రి, కాత్యాయని విద్మహే, వోల్గా, మృణాళిని, చిరంజీవినీ కుమారి, దావులూరి కృష్ణకుమారి.. ఒకరా ఇద్దరా మేరునగధీరుడు అనదగ్గ సాహితీవేత్తలు తమ వాణిని వినిపించారు. గురజాడను జాతీయ కవిగా గుర్తించాలని వారంతా ఆ ప్రారంభం దినోత్సవం రోజు ప్లకార్డులు పట్టు కొని విజయనగర వీధుల్లో ఊరేగారు. ఇదంతా నిన్న మొన్న జరిగినట్టుగానే ఉంది. అది ఒక చరిత్ర అయింది. ఏదైనా ఈ రోజు చేస్తే కదా రేపటికి చరిత్ర అవుతుంది.
 
కన్యాశుల్కం నాటక ప్రదర్శన కూడా జరిగినట్టు ఉంది కదా?
అవును, కన్యాశుల్కం నాటక ప్రదర్శనతో కార్యక్రమం ముగించాలని ఆలోచన. సహాయం కోసం తెలుగు యూ నివర్సిటీ వీసీ నారాయణరెడ్డి గారిని కలిసాను. ఆయన సరే అన్నారు కానీ జె.వి.సోమయాజులు గారు కుదరదన్నారు. నేను ఏం, ఎందుకు అని ప్రశ్నించాను. ఆయన ఒకప్పుడు మా తాసిల్దార్‌గారే అంచేత ఆయన దగ్గర కొద్దిగా చనువు ఉంది. అప్పటికి వాళ్ల అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకోవడం మానేసి పదిహేనేళ్లు అయిందట. ఇద్దరూ ఎడమొహం పెడమొహంగా ఉన్నారు. జె.వి.రమణమూర్తిగారిని ఒప్పిస్తే మీకు సిద్ధమే కదా అన్నాను. ఆయన ఓకే అన్నారు. రమణ మూర్తిగారినీ ఒప్పించాను. చాలా కాలం తర్వాత అన్నద మ్ములు కలిసి కన్యాశుల్కం నాటకం విజయనగరంలో ప్రద ర్శించారు. ఆ తర్వాత సోమయాజులుగారు అంటుండేవారు ‘‘మా అన్నదమ్ములు ఇద్దర్ని నువ్వే కలిపావయ్య’’ అని. ఆ సమయంలో ఫోటోగ్రాఫర్లు ఈ పని తమదే అన్నంతగా మమేకమయ్యారు. కార్యక్రమాన్ని ప్రపంచానికి చూపే ప్రయ త్నం చేశారు. ఎంతో శ్రమపడ్డారు. ముఖ్యంగా జగన్‌, కె.శ్రీని వాస్‌ చివరి మూడు రోజులు వెలుగుతోనే ఉన్నారు. అసౌక ర్యాలు పట్టించుకోకుండా సహృదయంతో సహకరించారు.
 
‘మూడు ఏభయిల’ గురజాడ కార్యక్రమం గురించి..?
నూరేళ్ళ కన్యాశుల్కంలాగే ఈ కార్యక్రమం కూడా ఏడాది పాటు చేసాం 2011 సెప్టెంబర్‌లో విజయనగరం ఆనంద గజపతి కళాక్షేత్రంలో ప్రారంభమై, ఏడాది పొడవునా రాజాంలో సభలు జరుపుకొని, విశాఖలో మూడు రోజుల సభలు అనంతరం 2012 సెప్టెంబరు 21న కళాభారతిలో సంపూర్ణ కన్యాశుల్కం ప్రదర్శనతో ముగించాం. రాజాం దూరం అయినా సాహితీవేత్తలు అందరూ వచ్చారు. కాకరాల, సిధా రెడ్డి కాళిదాస పురుషోత్తం, ఢిల్లీ సుబ్రహ్మణ్యం, ఓల్గా, నవీన్‌, సుంకిరెడ్డి, ఇలా చాలామంది.
 
సంపూర్ణ కన్యాశుల్కం నాటక ప్రదర్శన గురించి...?
ఇంతకుముందు ఎవరో ఎప్పుడో ప్రదర్శించారని వినడమే గాని వివరాలు అయితే తెలీదు. ఈసారి ఎలాగైనా సంపూర్ణ నాటకం ప్రదర్శింప చేయాలని అనుకున్నాం. చలసాని, విశాఖవర్మ, లీడర్‌ రమణమూర్తి చేయూతనిచ్చారు. చాలా మంది ఇది సాహసం అన్నారు, వీలు కాదన్నారు. దాదాపు తొమ్మిది గంటల నాటకాన్ని వేసే వాళ్ళకు ఓపికుంటే, చూసేవాళ్ళకు ఉండొద్దా అన్నారు. చాలామంది పెదవి విరి చారు. విజయనగరం ఎస్‌ కిషోర్‌ దర్శకత్వంలో నవయువ సంస్థ తరఫున నాటక ప్రదర్శన జరిగింది. ఎవరు చూస్తారు అన్న నాటకం తెలుగునాట తొమ్మిది ప్రదర్శనలు జరుపు కుంది. మొదటి ప్రదర్శన విశాఖ కళాభారతిలో జరిగిన ప్పుడు ఇంటర్వెల్లో బయటకు వెళితే వచ్చేసరికి సీట్‌ ఉంటుందో ఉండదో అనే అనుమానంతో బయటికి రాలేదు చాలామంది. చలసాని స్టేజీ మెట్లమీద కూర్చుని చూసాడు. ప్రదర్శనలో చిన్న చిన్న లోపాలు కనిపిస్తున్నా ప్రేక్షకులు వాటిని పట్టించుకునే పరిస్థితిలో లేరు. అది నాటకం గొప్ప తనం. ఈ సందర్భంలో రాళ్లబండి కవితా ప్రసాద్‌ గారిని తెలుసుకోవడం మర్యాద. ఆయన మన చొరవ లేకపోతే రవీంద్రభారతిలో ఈ ప్రదర్శన జరిగేది కాదు.
 
గురజాడను బాగా గుర్తు పెట్టుకున్నట్టున్నారు?
ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు గురజాడ కొండగుర్తు కదా. విజయనగరం గజపతిరాజులకు విద్యారంగం పట్ల, లలిత కళల పట్ల, అభిరుచి, ఔదార్యం లేకపోతే, ఈరోజు చెప్పుకోడానికి ఏముంది. ‘‘ఊరు విజయ నగరం. పేరు మధురవాణి’’ అని ఆ మహాతల్లి చెప్పుకుంటే ఈరోజు మేము కూడా చెప్పుకుంటున్నాం కదా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం కదా. ఇక గురజాడ అం టారా మనం పట్టించుకోవాల్సిన అంతగా పట్టించుకోలేదు. పట్టించుకుంటే వెధవాయిత్వం ఇంతగా వ్యవస్థీకృతం కాకపోను. గురజాడ, ఠాగూర్‌ ఇద్దరూ ఈడు జోడు వారే. ఇద్దరూ ఇద్దరే. 150 ఏళ్ల ఠాగూర్‌ ఊరేగింపు కార్యక్రమంలో కలకత్తా వీధుల్లో ప్లకార్డు పట్టుకుని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్య మంత్రి ముందు నిలబడింది. గురజాడకి ఆ గౌరవం దక్కిందా? మరి మనం జయంతులు వర్ధంతులు జరిపి ఏం లాభం? ఏలిన వారికి ఉండాలి కదా? ‘‘ఠాగూర్‌కే కాదు గురజాడకూ 150’’ అని సంపాదకీయం రాసి గుర్తుచేశాడు కె. శ్రీనివాస్‌ మరి మిగతా పత్రికల సంగతి?
‘వెలుగు’ చాలా పుస్తకాలు కూడా ప్రచురించింది కదా?
‘ఐదు దశాబ్దాల సమాలోచన’ పుస్తకాన్ని మొదలుకొని ‘నూరేళ్ళ కన్యాశుల్కం’, ‘మూడు ఏభయిల మన గురజాడ’ వరకు చాలా పుస్తకాలను ‘వెలుగు’ అచ్చు వేసింది. సాలు పొడుగునా జరిగిన రెండేళ్ల వక్తల ప్రసంగ పాఠాలను చిన్న చిన్న పుస్తకాలుగా అచ్చు వేసింది. ఇన్నేళ్లుగా వెలుగు ఇన్ని కార్యక్రమాలు చేయగలిగింది అంటే దానికి ఎంతోమంది మహానుభావులు సాయం చేశారు. వారందరికీ వందనాలు.
 
ఆధునిక తెలుగు సాహిత్యానికి సంబంధించినంత వరకు గురజాడ కొండగుర్తు కదా. విజయనగరం గజపతిరాజులకు విద్యారంగం పట్ల, లలిత కళల పట్ల, అభిరుచి, ఔదార్యం లేకపోతే, ఈరోజు చెప్పుకోడానికి ఏముంది. ‘‘ఊరు విజయనగరం. పేరు మధురవాణి’’ అని ఆ మహాతల్లి చెప్పుకుంటే ఈరోజు మేము కూడా చెప్పుకుంటున్నాం కదా. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకుంటున్నాం కదా. ఇక గురజాడ అంటారా మనం పట్టించుకోవాల్సిన అంతగా పట్టించుకోలేదు. పట్టించుకుంటే వెధవాయిత్వం ఇంతగా వ్యవస్థీకృతం కాకపోను.
 
చిరుదీపం వెలిగించాలనే సదాశయంతో నాలుగు దశాబ్దాల క్రితం చాసో గౌరవ అధ్యక్షుడిగా విజయనగరం రైల్వే కాలనీలో ‘వెలుగు’ సంస్థ ప్రారంభమైంది. ఆదిలోనే అది కొడిగట్టిపోకుండా నా సహోద్యోగులు సహకరించారు- గోరంత దీపం కొండంత వెలుగు అనే ఆశతో. శీలా వీర్రాజు గారు ‘వెలుగు’ ఆశయాన్ని ప్రతిబింబిస్తూ మంచి లోగో చిత్రించారు. నాటి నుంచి నేటి వరకు గురజాడ అడుగుజాడను ఆదర్శంగా తీసుకుని తన పయనాన్ని కొనసాగిస్తూనే ఉంది.
 
ఇంటర్వ్యూ: జి.ఎస్‌. చలం