ఉస్మానియా యూనివర్సిటీ, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): అనువాదాలు సాంస్కృతిక వారధులని కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, ప్రముఖ కవి డాక్టర్‌ ఎన్‌.గోపి అన్నారు. డాక్టర్‌ ఎన్‌.గోపి రచించిన ‘చైనా పద్యాలు’, ‘జీవన భాష’ గ్రంథాలకు స్వాతి శ్రీపాద అనువాదాల ఆవిష్కరణ సభ మంగళవారం నేషనల్‌ బుక్‌ ట్రస్ట్‌ సమావేశ మందిరంలో మహిత సాహితీ ఆధ్వర్యాన జరిగింది. ఈ సందర్భంగా మూల రచయిత ఎన్‌.గోపి మాట్లాడుతూ అనువాదాలు భాషల మధ్య, సంస్కృతుల మధ్య సేతువుల్లాంటివని అన్నారు. అనువాదాలు విరివిగా జరిగినప్పుడే దేశ ప్రజల మధ్య సోదరభావం పెరుగుతుందన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై పుస్తకాలను ఆవిష్కరించిన ప్రముఖ రచయిత, పాత్రికేయుడు ఉప్పలూరి ఆత్రేయశర్మ మాట్లాడుతూ స్వాతి శ్రీపాద చేసిన అనువాదం మూలానికి అతి దగ్గరగా ఉందన్నారు. కవితా పరిమళం చెడకుండా అనువాదం చేయడం సవాల్‌ అని అన్నారు. 

డాక్టర్‌ పత్తిపాక మోహన్‌ మాట్లాడుతూ గోపి పుస్తకాలు ఇప్పటికే ఇతర భాషల్లోకి అనువాదమయ్యాయని అన్నారు. ఏ కవి కవిత్వమైనా ఇతర భాషల్లోకి వెళ్లినప్పుడే ఆ కవిత్వం మరింత విశాలమవుతుందన్నారు. స్వాతి శ్రీపాద చేసిన అనువాదం చాలా గొప్పగా కుదిరిందన్నారు. ఓయూ తెలుగు శాఖ అధ్యక్షుడు ప్రొఫెసర్‌ సూర్యధనుంజయ్‌ మాట్లాడుతూ ఎన్‌.గోపి ప్రపంచ కవి అని, వారి రచనలు భారతీయ భాషల్లోకి వెళ్లాయని కొనియాడారు. రచయిత స్వాతి శ్రీపాద మాట్లాడుతూ గోపి ‘చైనా పద్యాలు’, ‘జీవన భాష’ పుస్తకాలు తననెంతో ఆకర్షించాయని, ఈ రెండు పుస్తకాలను ఇంగ్లీ్‌షలోకి అనువాదం చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డా.ఎ్‌స.రఘు, ఎం.నారాయణశర్మ పాల్గొన్నారు.