చిక్కడపల్లి , జూన్‌ 24 (ఆంధ్రజ్యోతి): రచయిత కెఎల్‌ కాంతారావు రచించిన వాల్మీకి చెప్పిన రామాయణ గాథ పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం రాత్రి సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఈసందర్భంగా పుస్తకాన్ని ఆవిష్కరించిన కేంద్ర సాహిత్య అకాడమీ తెలుగు విభాగం కన్వీనర్‌ కె.శివారెడ్డి మాట్లాడుతూ రామాయణమైనా, భారతమైనా కాలానికి అనుగుణంగా తర్కంతో చదవాలని అన్నారు. కాంతారావు ఈ పుస్తకాన్ని పిల్లలకు ఉపయోపగేవిధంగా రాశారన్నారు. సైన్స్‌ రచయిత అయిన కాంతారావు ఈ పుస్తకాన్ని తర్కదృష్టితో రచించారన్నారు. రామాయణాన్ని ఒక కావ్యంగా చదవాలని ఇప్పటికే సమాజంలో అనేక రామాయణాలు ఉన్నప్పటికీ ఇది భిన్నమైందన్నారు.

ఈ రామాయణంలో తన మనవడు మనవరాలు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పెరీతిలో ఈ పుస్తకం ఉండడం విశేషం అన్నారు. సమాజంలో ప్రశ్నించే తత్వం పెరగాలన్నారు. భూపతి వెంకటేశ్వర్లు అధ్యక్షతన జరిగిన సభలో విజ్ఞానకేంద్రం కార్యదర్శి ఎస్‌ వినయ్‌కుమార్‌, ప్రముఖ  కవి యాకూబ్‌, హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, జనవిజ్ఞానవేదిక రాష్ట్ర కార్యదర్శి వరప్రసాద్‌, పుస్తక రచయిత కెఎల్‌ కాంతారావు, తెలంగాణ సాహితి రాష్ట్ర ఉపాధ్యక్షులు తంగిరాల చక్రవర్తి, కోశాధికారి అనంతోజు మోహనకృష్ణ, జేవీవీ నాయకులు కృష్ణారావు, నరేష్‌, సైదులు, ఖయ్యూంభాషా, సంగీత, డా. రమాదేవి, ముజాహిద్‌ తదితరులు పాల్గొన్నారు.