రాజనారాయణకు సాహితీలోకం నివాళి

దక్షిణ తమిళనాడుకు వలస వచ్చిన

తెలుగువారి స్థితిగతులపై అమోఘ రచన

కోవిల్‌పట్టిలో కిరా విగ్రహం :

స్టాలిన్‌చెన్నై: కొన్ని వందల ఏళ్ల క్రితం తన పూర్వీకులు తమిళగడ్డకు వలస వచ్చినా మాతృభాషను మరువని తెలుగుతల్లి ముద్దు బిడ్డ, సుప్రసిద్ధ రచయిత, పాండిచ్చేరి విశ్వవిద్యాలయ మాజీ గౌరవ ప్రొఫెసర్‌ ‘కిరా’ (కి.రాజనారాయణ) మరణం సాహితీలోకంలో, ముఖ్యంగా తెలుగుభాషా ప్రేమికులకు విషాదాన్ని మిగిల్చింది. దక్షిణ తమిళనాడుకు వలస వచ్చిన తెలుగు ప్రజల స్థితిగతులపై రాసిన నవల ‘గోపాలపురత్తు మక్కల్‌’ నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం అందుకున్న ఆయన.. ఎక్కడున్నా తను తెలుగువాడినని ధైర్యంగా చెప్పుకునేవారు. తెలుగువారు కనిపిస్తే చాలు తమిళ యాసతో కూడిన తెలుగులోనే మాట్లాడేవారు. తన మాతృభాష అయిన తెలుగును చదువుకోలేకపోవడం తన జీవితంలో అతిపెద్ద లోటు అని ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూ లోనూ పేర్కొన్నారు. ఆయన రాసిన వందలాది కథలు, కథనాలు, నవలలు 30కిపైగా గ్రంథస్థరూపం దాల్చాయి. ఆయన చివరి గ్రంథం ‘మిచ్చకదైగళ్‌’ (మిగిలిన కథలు).తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలో ఉన్న ఇడైచ్చెవల్‌కు చెందిన కిరా 1922 సెప్టెంబరు నెల 19వ తేదీన జన్మించారు. ఆయన పూర్తిపేరు ‘రాయంగల్‌ శ్రీ కృష్ణరాజ నారాయణ పెరుమాళ్‌ రామానుజం’. దీన్ని క్లుప్తం గా కి.రాజనారాయణ అని పెట్టుకున్నారు.

ఆయన కలం పేరు ‘కిరా’. ఆ పేరుతోనే ఆయన ప్రసిద్ధుడయ్యారు. 7వ తరగతి వరకు మాత్రమే విద్యా భ్యాసం చేసిన ఆయనకు వ్యవసాయం అంటే అమితాసక్తి. నాలుగు పదుల వయస్సు దాటిన తర్వాతే ఆయన రచనలు అక్షరరూపం దాల్చాయి. ఆయన రాసిన తొలి షార్ట్‌ స్టోరి ‘మాయమాన్‌’ 1958లో ‘సరస్వతి’ పత్రికలో ప్రచురితమైంది. ఇది పాఠకులను అమితంగా ఆకర్షించింది. ఆ తర్వాత ఆయన అనేక కథలు రాశారు. కేవలం షార్ట్‌ స్టోరీస్‌ మాత్రమే కాకుండా, నవలలు కూడా రాశారు. ఈయన రచించిన అన్ని రచనలను కలిపి 944 పేజీలతో ఒక పుస్తకాన్ని ముద్రించారు. ఇది గ్రామీణ కథల పుస్తకభాండా గారం పేరుతో 2007లో ప్రచురితమైంది. ఈయన రచనల్లో కొన్ని తెలుగు, మలయాళం, ఆంగ్లంలోకి కూడా అనువాదమయ్యాయి. ఆయన రచనా ప్రతిభ, జానపదాలపై వున్న పట్టు గమనించిన పాండిచ్చేరి విశ్వవిద్యా లయం ఆయన్ని 1989లో గౌరవ ప్రొఫెసర్‌గా నియమించు కుంది.