సాహిత్యపరంగా శిఖామణితో నా పరిచయం ముప్పై అయిదేళ్ళు. శిఖామణి ఆలోచనలు, ప్రణాకల గురించి ఎప్పటికప్పుడు మాట్లాడుతూనే ఉంటాడు. ఏ కార్యాన్నైనా చిన్నగా ఉండడానికి ఇచ్చగించడు. భారీగా ఉండేలా వ్యూహరచన చేస్తాడు. సభ నిర్వహించాలనుకున్నపుడు రాజీ పడడు. ఘనంగా ఉండేలా ప్రయత్నిస్తాడు. శిఖామణి ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల విభజన తర్వాత కవిసంధ్య కార్యకలాపాల్ని యానాంకు బదిలీచేసి విస్తృతం చేశాడు. కరోనా క్లిష్ట సమయంలో ఆధునిక అంతర్జాతీయ వేదిక జూమ్‌ ద్వారా అనేక దేశీయ, అంతర్జాతీయ సదస్సులు, చర్చలు, ఉపన్యాసాలు ఏర్పాటు చేశాడు. తను ఉద్యోగ విరమణానంతరం గొప్ప సాహిత్య స్పృహను ప్రదర్శించాడు. పుస్తకాలు ప్రచురించాడు. శతజయంతులు నిర్వహించాడు. ఊళ్ళు తిరిగాడు. ఉపన్యాసాలు ఇచ్చాడు. అనేక అనుభవాలు మూటగట్టుకున్నాడు. గత ఏడెనిమిదేళ్ళ కాలంలో సాహిత్యమే ఊపిరిగా జీవనసరళిని తీర్చిదిద్దుకున్నాడు. 1987 సరసం అవార్డు నుంచి నేటి అజో-విభొ-కందాళం విశిష్ట సాహితీమూర్తి పురస్కారం వరకు అనేక అవార్డులు పొందాడు. కాకినాడలో జనవరి 8వ తేదీన అజో-విభొ-కందాళం 2022 విశిష్ట సాహితీమూర్తి పురస్కారం స్వీకరిస్తున్న సందర్భంగా, శిఖామణితో నా ముఖాముఖి:

మీ బాల్యం, చదువు, ఉద్యోగం గురించి చెప్పండి?

నా బాల్యం యానాంలోని ఆదియాంధ్రపేటలో సాగింది అది తర్వాత కాలంలో అంబేడ్కర్‌ నగర్‌గా మారింది. ఇక చదువు అంటారా నా తొలిగురువు ననుపెంచి పెద్దచేసిన శిఖామణి గారే. నేను నెలల వయసులో వున్నప్పుడే మా అమ్మ చనిపోయింది. అప్పటి నుండి మా నాయన మిత్రుడైన జి. రత్న శిఖామణి గారు నన్ను పెంచడంతో పాటు, మా కుటుంబాన్ని సాకారు. మాది పేద మధ్య తరగతి కుటుంబం. మా తాతలు అమలాపురం దగ్గర క్రాపచింతల పూడి నుండి వలస వచ్చారనీ, మాది చేనేత కుటుంబం అనీ, తన చిన్నప్పుడు ఇంట్లో నేత మగ్గాలు వుండేవని మా నాయన చెప్పేవాడు. పూనా ఆర్డినెన్సు ఫ్యాక్టరీలో చిరుఉద్యోగిగా వున్న మా నాన్న మా అమ్మ చనిపోయాక, పూనా నుంచి డబ్బులు పంపితే శిఖామణిగారు మమ్మల్ని పెంచారు.ఒకసారి మా నాయన తీవ్ర అనారోగ్యం చేసి ఉద్యోగానికి వెళ్లలేకపోయినపుడు యానాంలో శిఖమణి గారు మా కోసం జోలెపట్టి బియ్యం తెచ్చి మమ్మల్ని పోషించారు. నన్ను అమ్మలాపెంచి పెద్దచేసిన శిఖామణి గారి జ్ఞాపకార్థం ఆయన పేరును నా కలం పేరుగా చేసుకున్నాను. ఎం.ఎలో మాస్టారు అత్తలూరి అదేం పేరండీ అంటే, విషయం చెబితే, ఆయన చలించిపోయి, కానివ్వండి అన్నారు.

కవిత్వం వైపు మరలడానికి కారణాలేమిటి?

శిఖామణి గారు ఉదయం మొహం కడుక్కుని, మా చావడి వెనకగడప మీద కూచుని బైబిలులోని రెండు వచనాలు చదువు కునే వాడు. నాకూ అది అలవాటయ్యింది. భారతీయులకు రామా యణంలాగ, పాశ్చాత్యులకు బైబిలు ఆదికావ్యం. ఆ వచనం నిండా గొప్ప కవిత్వం కనిపించేది. వీటితో పాటు శిఖామణి గారు చందమామ, అభిసారిక, కాగడా వంటి పత్రికలు తెప్పించి చదివేవాడు. ఆ రోజుల్లో అవి ఆయన ఎలా సంపాదించాడో ఇప్పటికీ ఆశ్చర్యం.కొన్ని పత్రికలు ఆయన చూడకుండా దొంగ చాటుగా చదివేవాణ్ణి. మదురు సుబ్బారాయుడు, బిట్రగొంతమ్మ, గుర్రపు మోహనరావు వంటివారు ఇంటికి వచ్చి కథలు చెప్పడం చదివి వినిపించడం వంటివి చేసేవారు, గణపతి నవరాత్రుల్లో ఆడే నాటకాలు, యానాం వెంకన్న తీర్థంలోని భోగం మేళాలు, సన్‌ థియేటర్‌లోని నలుపు తెలుపు సిన్మాలు, అంతకు మించి శిఖామణి గారు కాకినాడ సుకెళ్లి చూపించిన జెమినీ సర్కస్‌లు, మేరానామ్‌ జోకర్‌ వంటి సిన్మాలు, అప్పట్లో జీవితం ఒక రంగుల ఉత్సవం. ఈ వాతావరణంలో పుట్ట్టి పెరిగిన వాడెవడైనా కవీ, రచయిత కాకుండా ఎలా వుండగలడు.