మారియో వర్గస్‌ లోసా తన ‘నోట్స్‌ ఆన్‌ ద డెత్‌ ఆఫ్‌ కల్చర్‌’ రచనలో సంస్కృతి కనుమరుగవ్వడం పట్ల ఒక ఆర్టిస్టుగా కలవరాన్ని వ్యక్తం చేశారు. సంస్కృతిని కాపాడుకునే దిశగా నాగరికత తెలిసిన మనిషికి ఉండాల్సిన కనీస సామాజిక బాధ్యతలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఆయన విశ్లేషణలన్నీ స్థిరగంభీరమైన సాధికారక స్వరంలో, ఒక కళాకారుడిలో పేరుకున్న నిస్సహాయతతో కూడిన ఆగ్రహాన్ని ప్రతిబింబిస్తాయి.

తరతరాలుగా సంస్కృతికి ఉన్న నిర్వచనాలు మారుతూ వస్తున్నాయి. శాస్త్ర సాంకేతిక విప్లవం జనసామాన్యానికి చేసిన మేలుతో పాటు కీడు కూడా ఉంది. ముఖ్యంగా కళారంగం మీద దాని దుష్ప్రభావం ఎక్కువగా కనిపిస్తోందన్నది ఆర్టిస్టుల అభియోగం. అభివృద్ధి మాటున కనుమరుగైపోతున్న సంస్కృతిని గురించి నోబుల్‌ గ్రహీత, స్పానిష్‌/ పెరూ రచయిత మారియో వర్గస్‌ లోసా ‘నోట్స్‌ ఆన్‌ డెత్‌ ఆఫ్‌ కల్చర్‌’ పేరిట కొన్ని వ్యాసాలు రాశారు. ఆ పుస్తకం చదివాక కదిలిన భావాలివి.సంస్కృతిని హైబ్రో, లోబ్రో కల్చర్స్‌ అంటూ దాని నాణ్యత దృష్ట్యా రెండు విధాలుగా విభజించడం మనకు తెలిసిందే. ఇలియట్‌, జేమ్స్‌ జోయ్స్‌ వంటివారి రచనలు హైబ్రో కల్చర్‌కి చెందితే, ఎర్నెస్ట్‌ హెమ్మింగ్వే, వాల్ట్‌ విట్మన్‌ లాంటివారి రచనలు సాధారణ పాఠకులకు అర్థమయ్యే రీతిలో లోబ్రో కల్చర్‌కి చెందుతాయి. ఈ విభజన రేఖల్ని చెరిపేస్తూ రష్యన్‌ తత్వవేత్త మిఖాయిల్‌ బఖ్తిన్‌, ఆయన అనుయాయులు రష్యన్‌ ఫార్మలిజం పేరిట తెలిసో తెలియకో ఒక రాడికల్‌ స్టెప్‌ తీసుకున్నా రంటారు లోసా. బఖ్తిన్‌ ఫిలాసఫీ సంస్కృతి మీద ప్రభావం చూపిస్తూ కళారంగంలో గణనీయమైన మార్పులకు దారితీసింది.‘‘ఒక దశలో సంస్కృతిలేని తరం రూపొందుతుంది’’ అని ఇలియట్‌ చెప్పిన జోస్యాన్ని నిజం చేస్తూ, సామాన్యతకు అసామాన్యతను ఆపాదించడం వల్ల సంస్కృతి విలువ క్రమేపీ తగ్గనారంభించింది. లోసా ఈ పుస్తకంలో టి.ఎస్‌.ఇలియట్‌ ‘Notes Towards the Definition of Culture’ పేరిట రాసిన పరిశీలనాత్మక వ్యాసంలోని కొన్ని అంశాలను ప్రస్తావి స్తారు. ఆదర్శవంతమైన సంస్కృతి- వ్యక్తి, సమూహం, సమాజం ఈ మూడింటి సమన్వయ, సహకారాలతో ఏర్పడుతుందని ఇలియట్‌ అభిప్రాయపడతారు. ఉన్నత వర్గం (elite class) పరిధిలో ఉండే సంస్కృతి నాణ్యత పరిరక్షింపబడాలంటే అది మైనారిటీ కల్చర్‌గా ఉండడం తప్పనిసరి అనేది ఆయన భావన.

ఈ వాదన అందరూ సమానమని చాటే ప్రజా స్వామిక విలువలకూ, లిబరల్‌ భావజాలాలకూ వ్యతిరేకంగా ఉన్నప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో సాంస్కృతిక విలువలను చూసినప్పుడు ఇలియట్‌ జోస్యం నిజమైంది కదా అనిపిస్తుంది.ఇలియట్‌ కలలుగన్న ‘హయ్యర్‌ క్లాస్‌’ స్థిరమైనది కాదు. అభిరుచులను ఆసరా చేసుకుని వ్యక్తిగత నైపుణ్యంతో ఎవరైనా ఒక వర్గం నుంచి మరొక వర్గంలోకి వెళ్ళవచ్చు. ఈ బదలాయింపు ఒక నియమంగా కంటే ఒక మినహాయింపుగా ఉంటుంది. ఇటువంటి వ్యవస్థ సమాజాన్ని క్రమబద్ధీకరిస్తుం దని నమ్ముతారు ఇలియట్‌. కానీ కేవలం విద్య ద్వారా సంస్కృతిని సమాజంలోకి అన్ని వర్గాలకూ వ్యాప్తి చెయ్యవచ్చనే భ్రమ నేటి తరంలో హయ్యర్‌ కల్చర్‌ను నిర్వీర్యం చేస్తోందంటారు లోసా. ఎందుకంటే సంస్కృతిని జ్ఞానంతో పోల్చడం సరికాదు. దీనికి తోడు సంస్కృతి క్షీణించడానికి దాన్ని ప్రజాస్వామ్యబద్ధం చెయ్యడం కూడా మరో కారణమని అభిప్రాయపడతారు లోసా. ఒకప్పుడు కేవలం కొన్ని వర్గాల నియంత్రణలో ఉన్న సంస్కృతి, ప్రజాస్వామిక, లిబరల్‌ సొసైటీలో అందరికీ అన్నీ సమాజంగా అందుబాటులో ఉండాలన్న ‘మోరల్‌ ఆబ్లిగేషన్‌’ కారణంగా విద్య ద్వారా, కళలను, సాహిత్యాన్నీ ప్రోత్సహించడం పేరిట అందరికీ లభ్యమవు తోంది. ‘అందరికీ సమానావకాశాలు’/ ‘అందరూ సమానం’ అనే రెండు వాక్యాలకు అర్థాలు వక్రీకరించబడి, కంప్యూటర్‌ కీ బోర్డు మీద టైపు చెయ్యడం వచ్చిన ప్రతివారూ రచయితలూ, ప్రచురించబడిన ప్రతిదీ సాహిత్యం అన్న తీరుగా తయారవుతోంది. ఏ కళారూపమైనా సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని అధిక సంఖ్యలో జనానికి చేరాలన్న ‘సివిక్‌ డ్యూటీ’ (Quantity at the expense of quality) కళ నాణ్యతను తగ్గించింది. కొత్త సంస్కృతికి కావాల్సినదల్లా మాస్‌ ఇండస్ట్రియల్‌ ప్రొడక్షన్‌, కమర్షియల్‌ సక్సెస్‌ మాత్రమే. వెలకూ, విలువకూ తేడాలు అదృశ్యమైపోయిన తరుణంలో ఆ రెండిటినీ ఒకే అర్థంలో వాడుతు న్నారు. ఈ కాలంలో విజయవంతమైనదీ, అమ్ముడుపోయేదీ మంచిది. జనరంజకం కానిదీ, అమ్ముడుపోనిదీ చెడ్డదిగా మిగిలిపోతోంది. విలువ ఏదైనా ఉందీ అంటే అది మార్కెట్‌ నిర్దేశించే ‘కమర్షియల్‌ వేల్యూ’ మాత్రమే.