తగిన ‘‘తోవ ఎక్కడ’’ అంటూ చాల కాలం వెదుకులాడిన సుంకిరెడ్డి నారాయణరెడ్డి గారు, తాను పని చేయవలసిన రంగాలను తెలిసికొని, తన శక్తియుక్తులు ఎక్కడ సద్వి నియోగం అవుతాయో గ్రహించి, ఆయా రంగాలలో చిరస్మరణీయమైన కృషి చేసారు. అట్లా చేరవలసిన తావుకు చేరుకున్నారు.అక్షరాన్నే సాధనంగా, రచనను బాధ్యతగా స్వీకరించిన సుంకిరెడ్డి వారి సాహిత్యయానం సమాంతరంగా నాలుగు మార్గాలలో సాగుతూవచ్చింది. 

కవిత్వం, విమర్శ, పరిశోధన, సంపాదకత్వం అనేవి వారి అక్షరాయుధానికి నాలుగు అంచులు. తాను ఉన్నది యూనివర్సిటీలోనైనా, శ్రీకాకుళంలో నైనా, నల్లగొండలోనైనా... ఎక్కడ ఉంటే అక్కడ, సామాజిక పరివర్తన దిశగా సాహిత్య చైతన్యాన్ని పరివ్యాప్తం చేయడం ఆయన వ్యక్తిత్వంలోని మరో ముఖ్య పార్శ్వం.1980 ప్రాంతం నుంచి 1994 ప్రాంతం వరకు రాసిన కవితలు ‘తోవ ఎక్కడ’ (1994) అనే సంపుటిలో ఉన్నాయి. ఇతరులతో కలిసి తెలంగాణ దీర్ఘకవిత ‘నల్లవలస’ (1998) రాశారు. తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో రాసిన కావ్యం ‘దాలి’ (2001). ఆ తర్వాత రాసిన కవితలు ‘తావు’ (2016) సంపుటిలో ఉన్నాయి. ఇతరులతో కలిసి రాసిన కవితలు మరికొన్ని ఉన్నాయి. ‘విపశ్యన’ (1986-1991) కవిత్వం దీనికి అదనం. ఒకదశలో తోవ ఎక్కడ అనే వెదుకులాట దీనికి ఒక కారణం కావచ్చు. అదే కాలంలో ఆధునికానంతర సిద్ధాంతాల నేపథ్యంలో అంకు రిస్తున్న, మొగ్గ తొడుగుతున్న అస్తిత్వ సాహిత్య ఉద్యమాలను అందిపుచ్చుకొని, ఆయా భావజాలాల వ్యాప్తికి అంకితం కావడం మరో కారణం కావచ్చు. ఈ దశలో వారు చేసిన సబాల్టర్న్‌ సాహిత్య సిద్ధాంతాల, ఆధునికానంతర సిద్ధాంతాల విస్తృత అధ్యయనం పరిగణించదగినది. ఈ అధ్యయన ఫలితాలను ‘గనుమ’ (2010), ‘వినిర్మాణం’ (2021) అనే విమర్శ గ్రంథాల్లో గమనించవచ్చు. ‘ముంగిలి’ (2009), ‘తెలంగాణ చరిత్ర’ (2012) అనే గ్రంథాలు వీరి పరిశోధనాతత్పరతకు నిదర్శనాలు.కవిత్వరంగంలో దీర్ఘకాలం కొనసాగాలంటే, స్పందనాశీలతను కాపాడుకోవడం మొదటి అవసరం. వస్తు, వ్యక్తీకరణలలో వైవి ధ్యాన్ని సమకూర్చుకోవడం అనివార్యం. సమకాలంతో కలసి నడవడం, రూపపరంగా క్రమ పరిణతిని సాధించడం అత్యా వశ్యకం. తనదైన విలక్షణ శైలి రూపొందడం లేదా రూపొందిం చుకోవడం ఎంత కష్టమో, తన శైలిని తానే చెరిపేసుకుంటూ, శైలీ వైవిధ్యాన్ని శైలీ నవ్యతను సాధించడం అంత కష్టం.వచనకవిత్వాన్ని లేదా వచనకవితా ఖండికను మాత్రమే పరి గణనలోకి తీసుకొని పరిశీలిస్తే, రెండు విధాలుగా వైవిధ్యాన్ని చూపించాల్సి ఉంటుంది. వ్యక్తీకరణ పద్ధతులకు, శైలికి సంబం ధించిన నిత్య నూతనత మొదటిది. వచనకవితా ఖండికా నిర్మాణ, నిర్వహణ నవ్యత రెండవది.

ఉత్తమ కవితా పఠనం వలన, కవితారచనలో అప్రయత్నంగా ఉత్తమ లక్షణాలు అలవడవచ్చు. కాని సప్రయత్నమైన కృషి కూడా అవసరమే. పైన చర్చించిన అన్ని అంశాలకు సంబంధించి సానుకూల లక్షణాలు కలిగిన తెలుగు కవులలో అగ్రశ్రేణికి చెందిన కవి సుంకిరెడ్డి.‘‘రాత్రేగా/ తను పోష్టర్లతో కనిపించింది!/ తెల్లారే సరికి/ తానే పోష్టరయ్యిండు!’’ ఇక్కడ మొదటి పోష్టర్‌ కార్యకర్తృత్వాన్ని సూచి స్తుంది. క్రోధ మూలకమైన శోకానికి, వేదనాత్మకమైన ఆవేశానికి, ఉత్తేజాన్ని నింపే అమరత్వానికి, ఇట్లా అనేక భావాలకు సంకేతం రెండవ పోష్టర్‌. ‘‘రాత్రేగా/ ఆ తడి పెదవులు ఆగ్రహంగా కైగట్టినవి!/ తెల్లారేసరికి బిడ్డను ముద్దాడలేని స్థాణువులైనవి!’’ ఇట్లా పరస్పర విరుద్ధమైన అంశాలను ఏకత్ర సమన్వయించడం ద్వారా, పరోక్షంగా వ్యక్తం చేయబడిన తీవ్రమైన అనుతాపం చదువరిని కరిగిస్తుంది. ‘‘కంఠంలో దిగిన తల్వార్‌ నిజం చెప్పదు!/ వాలిన ఈగలు రక్తమంటిన రెక్కలతో బయలెల్లినవి!’’ కంఠంలో దిగిన తల్వార్‌ రాజ్యహింసకు, రక్తమంటిన ఈగలు బయ లెల్లడం అమరుల ఆకాంక్షలను నెరవేర్చే క్రాంతి ప్రస్థానానికి సంకేతాలు. ‘‘ఎవ్వరుగూడ పెదిమల మీది వేలు తీయొద్దు!/ ఎందుకైనా కనుబొమలు పైకెత్తొద్దు!’’ ఇక్కడ రెండు జెష్చర్లు వరుసగా, నిషిద్ధమైన నిరసనను, నేరాలుగా మారే ప్రశ్నలను ధ్వనిస్తాయి. ప్రశ్నలను హత్య చేసే రాజ్యం, సానుభూతిపూర్వక మైన సంవేదనలను కూడా నేరాలుగానే భావిస్తుంది. ఆంక్షలు ఎవరివో, శిక్షలు ఎవరికో, పైరెండు అంగవిన్యాసాలు తెలియ జేస్తూనే, ‘ఆంక్ష’ అనే శీర్షికలోని సార్థకతను ధ్వనిస్తాయి.