ధర్మనిష్ఠ, ప్రేమ, సమానత్వం తరఫునే చోఖామేలా నిశ్శబ్ద పోరాటం చేశాడు. ఛాందసత్వం, కుల అహంకారం మీద తన అభిప్రా యాలు దాచుకోలేదు. ఏనాడూ ఎవరి దగ్గరా న్యూనతా భావాన్ని ప్రదర్శించలేదు. అతని కవితలు, విఠలుని మీద భక్తి ప్రధానమైనవే అయినా, అంటరానితనాన్ని ప్రస్తావించకుండా లేవు.

భక్తి ఉద్యమ మూలాలు దక్షిణ భారతదేశంలో 6వ శతాబ్దానికే ఉన్నాయి. అది మధ్య పశ్చిమ భారతదేశానికి 12వ శతాబ్దానికి ప్రాకి, 17వ శతాబ్దాంతంలోగా మిగతా భారతదేశానికి విస్తరించింది. వివిధ రూపాల్లో, వివిధ కాలాల్లో, వివిధ అభివ్యక్తుల్లో బయటకొచ్చింది. మునుల్లా జీవించిన కవులే ఈ అన్ని శతాబ్దాల్లోనూ దానికి ముఖ్య కారకులు. అందులో స్త్రీలూ ఉన్నారు, అన్నింటికీ దూరంగా ఉంచబడ్డ దిగువ కులాలవారూ ఉన్నారు. దిగువ కులాలగా భావించబడ్డ వారిలో 7-8 శతాబ్దాల మధ్య వాడైన దళిత శైవ భక్తకవి నందనార్‌, 9-10 శతాబ్దాల మధ్య వారైన ప్రముఖ శ్రీ వైష్ణవ భక్త కవులు నమ్మాళ్వార్‌, తిరుమంగై ఆళ్వార్‌, తిరుప్పాణాళ్వార్లు; 14వ శతాబ్దపు నామదేవ్‌, చోఖామేలా, పంజాబ్‌కి చెందిన 15-16 శతాబ్దపు సంత్‌ రవిదాస్‌లు మొదలైనవారున్నారు.

14వ శతాబ్దపు చోఖామేలా (?-1338) నిమ్న కులాల పట్ల జరుగుతున్న వివక్షను, తాను నమ్ముకున్న పండరీపుర విఠలుడికే కాదు, ప్రజలందరికీ, అభంగ్‌ లనే భక్తి పాటలు ద్వారా విన్నవించుకున్నాడు. సరళమైన స్థానిక భాషలో ఒక గొప్ప ఆధ్యాత్మిక సారాన్ని ప్రజలకు చేరువ చేసాడు.

కన్నడ ప్రాంతానికి చెందిన 12వ శతాబ్దపు మాదర చెన్నయ్య తరువాత, బహుశా చోఖామేలానే మరాఠీ చరిత్రలో నమోదయిన మొదటి దళిత కవి. అతను పుట్టిన సంవత్సరం తెలియదు. పండరీ పురం దగ్గరలో ఉన్న మంగళవేధ గ్రామంలో భార్య సోయరా, కొడుకు కర్మమేలాతో నివసించాడన్నది అందరికీ తెలిసిన సత్యం. అంటరానికులంగా భావించ బడ్డ మహర్‌ దళిత కులానికి చెందినవాడు కావడం మూలాన చివరివరకూ ఎన్నో ఇబ్బందులకు గురికాక తప్పలేదు. అతని కవిత్వం బాధాతప్త హృదయాన్ని, ఆధ్యాత్మిక పరిపక్వతను తెలియజేస్తుంది.

మహర్‌ కులస్థులు గ్రామాన్ని ఊడ్చి శుభ్రంగా ఉంచడం, చచ్చిన పశువులను తొలగించి వాటిని ఊరవతల ఖననం చేయడమేకాక, ఊరికి దూరంగా ఆయా కులస్థులతోపాటే ఉండాలన్నది అప్పటి నియమం. చదువులకు దూరం కావడమే కాకుండా, పై కులస్థులు తినగా వది లేసిన తిండిని ప్రసాదంలా సేకరించి తినడం కూడా అందులో ఒకటి.

చోఖామేలా పండరీపురం ఒకసారి వచ్చినపుడు సంత్‌ నామదేవ్‌ (1270-1350) బోధనల్ని విన్నాడు. అతనిమీద అవి విశేషమైన ప్రభావాన్ని చూపించాయి. అతన్ని గురువుగా స్వీకరించి, షోలా పూర్‌లో ఉన్న పాండురంగ విఠలుని భక్తుడుగా మారిపోయాడు. చోఖామేలా 1280-90 ప్రాంతంలో భార్యా పుత్రునితో పండరీపురానికి నివాసం మార్చుకున్నాడు. పండరీపురంలో అతనిని, అతని కులస్థులతో పాటు ఊరి చివరనే ఉండనిచ్చారు. గుడి లోనికి ప్రవేశం లేకుండా కట్టడి చేసారు. అంచాత భీమా నదికి ఉపనదియైున చంద్రభాగ నది ఒడ్డున, దూరంలోనైనా గుడి కనిపించే స్థలంలో కుటీరం కట్టుకున్నాడు.

సమాజంలో మనుషుల మధ్య వ్యత్యాసం చోఖాకు భరించరాని అన్యాయంగా అనిపించేది. ఆ విధమైన సృష్టికి కారణమైన దేవునికి, తన అభంగ్‌లతో ఫిర్యాదు చేసేవాడు, నిలదీసేవాడు కూడా. ఈ అభంగ్‌ లన్నవి భంగం కాని భక్తిపూరితమైన పాటలు, లేదా భజనలు. ఈ అభంగ్‌లన్నీ మౌఖికంగా ఉండటం మూలాన చోఖా అభంగ్‌లు ఎన్ని ఉన్నాయన్నది సరిగ్గా తెలియదు. 200 నుండి 350 వరకూ ఉంటాయని ఒక అంచనా. వాటిల్లో ఎక్కువ భాగం విఠల్‌ దేవునితో ముడి వేసుకున్నవే అయినా, చాలావరకు అతని ఆత్మ కథల్లా సాగుతాయి. చోఖా మేలా అభంగ్‌లను అనంత భట్‌ అనే భక్తుడు సేక రించి రాసి భద్రపరిచాడు.