తెలుగు నేలను ఒక ఊపు ఊపేసిన సంచలన సాంఘిక నాటకం “చింతామణి”. సాంఘిక నాటకాలలో ఇంత ప్రసిద్ధమైన నాటకం  మరొకటి లేదు . ఈ నాటకం పుట్టి ఇప్పటికి 100 ఏళ్ళు పూర్తయింది. ఈ వందేళ్ళల్లో ప్రపంచంలో తెలుగువారు ఎక్కడుంటే అక్కడ కొన్ని వేల ప్రదర్శనలకు నోచుకొని, అనంతమైన కీర్తిని  సాధించిన  అద్భుతమైన నాటకం.. ఇదొక్కటే .. 

సంస్కృతంలోని “లీలాశుక చరిత్ర” ఆధారంగా దీన్ని కాళ్ళకూరి నారాయణరావు రాశారు.. ఈ నాటకంలో చింతామణి, బిల్వమంగళుడు, భవానీశంకరం, శ్రీహరి, చిత్ర  పాత్రలు  పాపులర్ . బిల్వమంగళుడు-చింతామణి చుట్టూ ఈ నాటకం తిరుగుతుంది. చింతామణి మోజులోపడిన బిల్వమంగళుడు తండ్రిని, భార్యను నిర్లక్ష్యంచేస్తాడు.  సకలం కోల్పోతాడు. అక్కడినుంచి ప్రారంభమైన అతడి పతనం.. అందులో దాగిన  రకరకాల  సామాజిక ధోరణులు ఈ నాటక ఇతివృత్తం.. 
 
వందేళ్ల నాటి తెలుగు వ్యావహారిక భాషలో పద్యాలు, సంభాషణలతో కాళ్ళకూరి నారాయణరావు దృశ్యకావ్యంగా ఈ  నాటకాన్ని తీర్చిదిద్దారు . కానీ, , కొందరు  నాటక సంభాషణలను అశ్లీలంగా మార్చి ప్రదర్శించడం ప్రారంభించారు. దీని వల్ల ఈ నాటకం జనంలోకి బాగా వెళ్ళింది. కానీ, అపకీర్తిని మూటగట్టుకుంది. ఒరిజినల్‌గా కాళ్ళకూరి నారాయణరావు రాసిన సంభాషణలు వేరు -తర్వాత మారిపోయిన మాటలు పూర్తిగా వేరు. సంభాషణలే కాక, ప్రదర్శనకూడా  జుగుప్సాకరంగా  మార్చివేశారు. దీని వల్ల చాలా చోట్ల ప్రదర్శనలపై నిషేధం విధించాల్సిన పరిస్థితి కూడా వచ్చింది. సుబ్బిశెట్టి, శ్రీహరి, చిత్ర పాత్రలు మరింత ఘోరంగా మారిపోయాయి. హాస్యం శృతి మించి, అశ్లీలం అయిపోయింది. ఈ హోరులో ఉదాత్తమైన బిల్వ మంగళుడు పాత్ర కూడా కొట్టుకుపోయింది.
 
చింతామణి”ని  సినిమా గానూ నిర్మించారు. 1933లో మొట్టమొదటగా కాళ్ళకూరి సదాశివరావు దర్శకత్వంలో, పులిపాటి వెంకటేశ్వర్లు, దాసరి రామతిలకం ప్రధాన పాత్రలుగా తెలుగులో వచ్చింది. 1956లో పి.ఎస్. రామకృష్ణా రావు  దర్శకత్వంలో ఎన్టీఆర్, భానుమతి ప్రధాన పాత్రలుగా భరణి స్టూడియోస్ బ్యానర్ పై సినిమాగా నిర్మించారు. స్టేజ్ నాటకం విజయవంతమైనంతగా, సినిమాలు హిట్ అవ్వలేదు. ఈ నాటకం లోని సందేశాన్ని ఒన్స్ మోర్ అంటూ సామాన్యులు…అడిగిమరీ చెప్పించుకున్నారు. నాటక రంగ చరిత్రలో “చింతామణి” ఎప్పటికీ చిరంజీవిగా నిలుస్తుంది.