సేజ్‌, హ్యాచెట్‌ అంతర్జాతీయ ప్రచురణ సంస్థల స్టాళ్లు ప్రత్యేకం 

హైదరాబాద్‌ సిటీ, డిసెంబర్‌ 13(ఆంధ్రజ్యోతి):  ఈ నెల 23నుంచి ప్రారంభం కానున్న హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌లో ఆంధ్రప్రదేశ్‌తో పాటూ కర్నాటక, తమిళనాడు, మహారాష్ట్ర  తదితర ప్రాంతాల నుంచి ప్రచురణ సంస్థలు పాల్గొననున్నట్లు సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ కమిటీ బాధ్యులు విలేకరుల సమావేశం నిర్వహించారు. గౌరీశంకర్‌ మాట్లాడుతూ సాహిత్యాభిరుచి కలిగిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అందిస్తున్న సహకారం వల్లనే దేశవ్యాప్తంగా ఢిల్లీ, కోల్‌కతా, రాజస్థాన్‌ బుక్‌ఫెయిర్‌ల తర్వాత హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శనకు తగిన గుర్తింపు లభించిందన్నారు. గత ఐదేళ్లుగా పుస్తక మహోత్సవానికి ఎన్టీఆర్‌ గ్రౌండ్‌ (తెలంగాణ కళాభారతి)ను ప్రభుత్వం ఉచితంగా కేటాయిస్తోందని చెప్పారు. యువతలో సాహిత్య జిజ్ఞాసను పెంపొందించాలనే లక్ష్యంతో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ సొసైటీ రొట్టమాకురేవు వంటి మారుమూల పల్లెల్లోనూ పుస్తకాల పండగ నిర్వహణను తలపెట్టిందని పేర్కొన్నారు. సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌ మాట్లాడుతూ  పిల్లలకోసం ప్రత్యేకంగా ‘‘బాలమేళ’’ నిర్వహించనున్నట్లు చెప్పారు. వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం, భాషా సాంస్కృతిక శాఖల సహకారంతో హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ జ్ఞాన తెలంగాణ నిర్మాణంలో ముఖ్య పాత్ర వహిస్తోందని కొనియాడారు. సమావేశంలో బీసీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్‌ బాలాచారి, బ్రహ్మం, బుక్‌ఫెయిర్‌ సొసైటీ పూర్వ అధ్యక్షుడు శృతికాంత్‌ భారతి, తదితరులు పాల్గొన్నారు. 

 
33వ హైదరాబాద్‌ జాతీయ పుస్తక ప్రదర్శన
చిరునామా: ఎన్టీఆర్‌ స్టేడియం(తెలంగాణ కళాభారతి)
ఇందిరాపార్కు ఎదురుగా, బాగ్‌లింగంపల్లి. 
 
సందర్శనీయ వేళలు.. 
సోమవారం నుంచి శుక్రవారం వరకుమధ్యాహ్నం 2.30గంటల నుంచి రాత్రి 8.30వరకు
శని, ఆది.. సెలవు దినాల్లో మధ్యాహ్నం 12నుంచి రాత్రి 9గంటల వరకు. 
విద్యార్థులకు ప్రవేశం ఉచితం.
కవులు, రచయితలకు ఉచిత ప్రవేశ పాసులు ఇస్తున్నారు. అందుకోసం వాళ్లు నవోదయ, నవతెలంగాణ, నవచేతన  తదితర బుక్‌ షాప్స్‌ వద్ద సంప్రదించగలరు.
ఇతరులకు ప్రవేశ రుసుం - రూ10. వాహనాల పార్కింగ్‌ ఉచితం.    
 

పిల్లల కోసం..  
పిల్లల్లోని ఒత్తిడి తగ్గించి, వికాసం దిశగా నడిపించాలనే ఉద్దేశంతో బుక్‌ ఫెయిర్‌ సొసైటీ ‘‘బాలమేళ’’ కార్యక్రమాన్ని నిర్వహించనుంది.  అందులో మిమిక్రీ, ఫ్యాన్సీడ్రస్‌, ఒక్క నిమిషం తెలుగు, చిత్రలేఖనం, బృంద నృత్య పోటీలతోపాటూ.. పిల్లల్లో సాహిత్యాభిరుచిని పెంపొందించడం కోసం కవిసమ్మేళనం, పాటల పోటీలు, వ్యాసరచన, కథలు చెప్పడం, రచన వంటి కార్యక్రమాలలు ఉంటాయని చెబుతున్నారు. వెంట్రిలాక్విజమ్‌, క్రాఫ్ట్స్‌, పప్పెట్స్‌ వర్క్‌షాష్‌ వంటి కార్యక్రమాలు ప్రత్యేకం. విద్యార్థుల్లో ప్రశ్నించే తత్వం పెంపొందించడంతోపాటూ శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చేందుకు విజ్ఞానశాస్త్ర సంబంధిత కార్యక్రమాలూ ఉంటాయని కోయ చంద్రమోహన్‌ వివరించారు. బాల సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత చొక్కాపు వెంకటరమణ, వీఆర్‌శర్మ, రంగస్థల నిపుణుడు శాంతారావు, సీఏ ప్రసాదు, సమీర్‌, సిరిస్వామి, అనీల, అనంతోజు మోహన్‌కృష్ణ, జిల్లా నరేశ్‌ తదితరుల ఆధ్వర్యంలో బాలమేళ జరగనుంది.  పన్నెండేళ్లు దాటిన పిల్లలకు వాళ్ల తల్లిదండ్రుల సమక్షంలో ‘‘పర్సనాలిటీ అస్సె్‌సమెంట్‌ టెస్ట్‌’’ను ఉచితంగా నిర్వహించనున్నట్లు బుక్‌ఫెయిర్‌ సొసైటీ నిర్వాహకులు పేర్కొన్నారు. ‘‘బాలమేళ’’ కార్యక్రమంలో పాల్గొనాలనుకునే చిన్నారులు ముందుగా పేరు నమోదు చేయించుకోవడం కోసం 94900 99378, 81878 08285 నెంబర్లలో సంప్రదించగలరు.