హైదరాబాద్‌ సిటీ, అక్టోబర్‌ 15, ఆంధ్రజ్యోతి: గొప్ప రచయితల రచనలన్నీ కూడా తొలుత తిరస్కరించబడినవే! హ్యారీ పోటర్‌ కథను 12 సార్లు తిరస్కరించారు. అలాగే మార్గరెట్‌ మిచెల్‌ రచన ‘గాన్‌ విత్‌ ద విండ్‌’ను ఏకంగా 38 సార్లు తిరస్కరించారు. ఇక తన తొలి పుస్తకం రోజాబెల్‌లైన్‌ను 47 సార్లు తిరస్కరించారు అని అన్నారు సుప్రసిద్ధ రచయిత అశ్విన్‌ సంఘీ.రోజాబెల్‌లైన్‌, చాణక్యాస్‌ చాంట్‌, ద కృష్ణ కీ వంటి రచనల ద్వారా సుప్రసిద్ధమైన ఆయన ఫిక్కీ లేడీస్‌ ఆర్గనైజేషన్‌ (ఎఫ్‌ఎల్‌వో) హైదరాబాద్‌ చాప్టర్‌  ఏర్పాటుచేసిన 13 స్టెప్స్‌ టు బ్లడీ గుడ్‌ లక్‌ సదస్సుకు ప్రత్యేకంగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అదృష్టమనేది 99ు సంప్రదాయపరమైనది అయితే, 1ు బ్లడీ గుడ్‌ లక్‌ అని అన్నారు. తాను రచించిన 13 స్టెప్స్‌ బ్లడీ గుడ్‌లక్‌ పుస్తకంలో ఆరు నేపథ్యాల ద్వారా ఈ గుడ్‌లక్‌ గురించి వివరించే ప్రయత్నం చేశానన్నారు. అదృష్టమనేది ఒంటరితనాన్ని ద్వేషిస్తుందన్న ఆయన అదృష్టం, దురదృష్టం అనేవి అసలు లేవని, పాజిటివిటీ, నెగిటివిటీ మాత్రమే ఉన్నాయన్నారు. రైటింగ్‌ అనేది కళ కాదని, అది ఓ నైపుణ్యమని సూత్రీకరించారు. చిన్నతనంలో పుస్తక పఠనాన్ని తన తాత పరిచయం చేశారని వారానికి ఓ పుస్తకం చొప్పున విభిన్నమైన నేపథ్యాలలో 400కు పైగా పుస్తకాలను ఆయన ఇచ్చారన్నారు.
రాసేందుకు నిర్దిష్టమైన నియమాలేవీ లేవంటూ బాత్‌రూమ్‌కు వెళ్లడానికి కూడా ఓ వ్యక్తి మీరు రాసిన కథ చదివి భయపడ్డారంటే అది అత్యుత్తమ థ్రిల్లర్‌ స్టోరీగా నిలుస్తుందన్నారు.