ఆగిన అందెల రవళి 
కొవిడ్‌తో శోభానాయుడు కన్నుమూత

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): ప్రఖ్యాత కూచిపూడి నాట్యాచార్యులు, పద్మశ్రీ పురస్కార గ్రహీత శోభానాయుడు(65) ఇకలేరు. కొంతకాలంగా మెదడు సంబంధిత సమస్య, కొవిడ్‌తో బాధపడుతున్న ఆమె ఒక కార్పొరేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి 1.40 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆమె అసలు పేరు శోభాదేవి. ఐదు దశాబ్దాల కిందట ఫెమీనా మేగజైన్‌ ఇంటర్వ్యూ ద్వారా శోభానాయుడిగా గుర్తింపు పొందారు. ఆమె స్వస్థలం విశాఖ జిల్లా అనకాపల్లి. తల్లిదండ్రులు వెంకన్ననాయుడు, సరోజినీదేవి. శోభానాయుడు భర్త, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అర్జునరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. కూతురు సాయి శివరంజని (అంజు) తల్లి వద్దే కూచిపూడిలో తర్ఫీదు పొందుతున్నారు. శోభ ఐదేళ్ల వయసులో రాజమండ్రిలోని శాస్త్రీయ నృత్యగురువు పి.లక్ష్మణరెడ్డి వద్ద శిష్యరికం చేశారు.

 

ఆరవ ఏట తొలిసారి నృత్యప్రదర్శన ఇచ్చారు. అనంతరం చెన్నైలో ప్రసిద్థ నాట్యగురువు వెంపటి చినసత్యం వద్ద పన్నెండేళ్లు కూచిపూడిలో శిక్షణ పొందారు. అదే సమయంలో క్వీన్‌ మేరీస్‌ కళాశాలలో డిగ్రీ పూర్తిచేశారు. కూచిపూడి ప్రక్రియలో నవరసాలను ఒలికించి, అభినయంతో రూపకాన్ని రక్తికట్టించడంలో అందె వేసిన శోభానాయుడును కలహంసతో పోలుస్తారు కళాభిమానులు. దాదాపు ఇరవై నృత్యరూపకాలను రూపొందించారు. అందులో ‘విప్రనారాయణ’, ‘కల్యాణ శ్రీనివాసం’, ‘స్వామి వివేకానంద’, ‘గిరిజాకల్యాణం’, ‘విజయోస్తుతే నారీ’, ‘క్షీరసాగర మధనం’, తదితర రూపకాలు శాస్త్రీయ నృత్యరంగంలో ‘శోభా’యమానంగా నిలుస్తాయంటారు కళా విమర్శకులు. చినసత్యం నృత్యదర్శకత్వంలోని ‘చండాలిక’ శోభానాయుడికి ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఆ నృత్యరూపకాన్ని ఆమె 700 సార్లు ప్రదర్శించారు.

 

ఆమె వందకుపైగా సోలో నృత్యప్రదర్శనలకు దర్శకత్వం వహించారు. అమెరికా, రష్యా, సిరియా, బాగ్దాద్‌, టర్కీ, యూకే తదితర దేశాల్లో ప్రదర్శనలు ఇచ్చారు.భారత ప్రభుత్వ సాంస్కృతిక రంగ ప్రతినిధిగా మెక్సికో, క్యూబా, వెనెజులా దేశాల్లో పర్యటించారు. ఐదు దశాబ్దాల్లో పదివేలకు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చిన ఘనత శోభానాయుడు సొంతం. కొంతకాలం కిందట ఆమె మోకాళ్ల శస్త్రచికిత్స చేయించుకున్నారు. అనంతరం నాట్యసాధననూ కొనసాగించారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి ఆకాంక్ష మేరకు శోభానాయుడు 1980లలో హైదరాబాద్‌, కూచిపూడి ఆర్ట్‌ అకాడమీ ప్రిన్సిపాల్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం శ్రీనివాస కూచిపూడి ఆర్ట్‌ అకాడమీని స్థాపించారు. ఆమె ప్రతిభకు గుర్తింపుగా 2001లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారం అందజేసింది. చెన్నై, కృష్ణగానసభ నుంచి ‘‘నృత్య చూడామణి’’ అవార్డు అందుకున్న తొలి కూచిపూడి కళాకారిణి శోభానాయుడు కావడం విశేషం. ఢిల్లీ, సంగీత, నాటక అకాడమీ అవార్డు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ఎన్టీఆర్‌ పురస్కారం, హంస అవార్డు, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పురస్కారం ఆమెను వరించాయి. బీఎన్‌ రెడ్డి, బాపు, విశ్వనాథ్‌ వంటి దర్శకుల నుంచి సినిమా అవకాశాలు వచ్చినా.. సున్నితంగా తిరస్కరించారు. బుధవారం మహాప్రస్థానంలో ఆమె అంత్యక్రియలను ఆస్పత్రి సిబ్బందే నిర్వహించారు.