చిక్కడపల్లి, హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి): అసలు పేరు ఓలేటి సుబ్బారావు అయినప్పటికీ రచయితగా, గేయ, భావకవిగా ఓలేటి శశాంక ప్రసిద్ధి పొందారని తెలంగాణ బీసీ కమిషన్‌ సభ్యులు డా.వకుళాభరణం కృష్ణమోహనరావు అన్నారు. ఆదివారం సాయంత్రం త్యాగరాయగానసభలో సాహితీవేత్త ఓలేటి సుబ్బారావు జయంతి సభ గానసభ అధ్యక్షుడు కళా జనార్దనమూర్తి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కృష్ణమోహనరావు మాట్లాడుతూ ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి రచయితల సంఘం అధ్యక్షుడిగా సాహిత్య సృజనకు విశేషంగా కృషి చేశారన్నారు. ఆయన వివాహం జరిగిన రోజు కూడా నయా జమానా సంపుటిని ఆవిష్కరించిన మహాకవి అన్నారు. కార్యక్రమంలో ఓలేటి పార్వతీశం, గాయకులు త్రినాథరావు, సంయుక్త, బండి శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.