అవార్డు‘అగ్నిశ్వాస’ రచనకు దక్కిన గౌరవం

మానసకు యువ సాహితీ పురస్కారం

అనసూయకు బాల సాహితీ అవార్డు

వీరప్ప మొయిలీ రచనకూ..

వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది రచయితలకు సాహిత్య అవార్డులు

న్యూఢిల్లీ/హైదరాబాద్‌ సిటీ, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): ప్రముఖ కవి నిఖిలేశ్వర్‌కు 2020 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది. ఆయన రాసిన ‘అగ్నిశ్వాస’ కవితా సంకలనానికి ఈ పురస్కారం లభించినట్లు అకాడమీ కార్యదర్శి శ్రీనివాసరావు తెలిపారు. 2020 సంవత్సరానికి కన్నెగంటి అనసూయ రాసిన ‘స్నేహితులు’కు బాల సాహితీ పురస్కారం, ఎండ్లూరి మానస(మిళింద కథలు)కు యువ సాహితీ పురస్కారం దక్కాయని చెప్పారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎండ్లూరి మానస తెలుగులో అనేక కథలు రాశారు. మరాఠీ నవల ‘ఓ’ ని 2015లో ‘ఊరికి దక్షిణాన’గా తెలుగులోకి అనువదించారు.

కేంద్రసాహిత్య అకాడమీ అవార్డు ప్రకటించడం ఎంతో సంతోషంగా ఉందని, ఈ పురస్కారం అందుకోవడం గౌరవంగా భావిస్తునట్లు మానస ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. అనసూయ ఇప్పటి వరకు 250కి పైగా కథలు, 150 బాలల కథలు, 100 కవితలు, 2 నవలలు రాశారు. ఆమె రాసిన బుద్థిబలం అనే కథ కేంద్రసాహిత్య అకాడమీ వారి కథల సంకలనంలో చోటు సంపాదించుకుంది. ఆ కథను దేశవ్యాప్తంగా 22 భాషల్లోకి అనువదించారు. కాంగ్రెస్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి వీరప్ప మొయిలీ కన్నడలో రచించిన ‘శ్రీ బాహుబలి అహింసా దిగ్విజయం’ కవితా సంకలనానికి కూడా అవార్డు దక్కింది. అరుంధతి సుబ్రమణ్యం ఆంగ్ల రచన ‘వెన్‌ గాడ్‌ ఈజ్‌ ఏ ట్రావెలర్‌’కూ అవార్డు దక్కింది. వివిధ విభాగాల్లో మొత్తం 20 మంది రచయితలకు సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి.

నిఖిలేశ్వర్‌ ప్రస్థానం 

నిఖిలేశ్వర్‌ అసలు పేరు కుంభం యాదవరెడ్డి. ఆయన స్వస్థలం యాదాద్రి జిల్లా వీరవల్లి గ్రామం. 82 ఏళ్ల నిఖిలేశ్వర్‌ దిగంబర కవితోద్యమ సారథుల్లో ఒకరు. ‘‘ఏనాటికైనా ఈ అగ్నిశ్వాస నా అంతరంగ భాష.. శ్రమ జీవన పోరాటాల శ్వాస’’ అంటూ సమకాలీన రాజకీయ, సామాజిక, ఆర్థిక అంశాలపై తన స్పందనే ‘అగ్నిశ్వాస’ కవితలు అని పుస్తకం ముందుమాటలో ఆయన వెల్లడించారు. నిఖిలేశ్వర్‌ ఉస్మానియా యూనివర్సిటీలో బీఏ, బీఈడీ, హిందీ భూషణ్‌ కోర్సులు పూర్తి చేశారు. గోల్కొండ పత్రికలో సబ్‌-ఎడిటర్‌గా పనిచేశారు. మూడు దశాబ్దాల పాటు కేశవ్‌ మెమోరిల్‌ హైస్కూల్లో ఉపాధ్యాయుడిగా సేవలందించారు. యాదవరెడ్డిగా తెలుగు సాహితీ లోకంలో అడుగుపెట్టిన ఆయన.. 1965లో ఆరుగురు దిగంబర కవుల్లో ఒకరిగా నిఖిలేశ్వర్‌ పేరుతో కవితా సృజన ప్రారంభించారు.


విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగానూ వ్యవహరించారు. పౌర హక్కుల ఉద్యమంలోనూ పాల్గొన్నారు. జనసాహితీ సాంస్కృతిక సమాఖ్యకు వ్యవస్థాపక సభ్యుడిగా ఉన్నారు. కేంద్ర సాహిత్య అకాడమీకి, తెలుగు సలహా మండలికి సలహాదారుగా కూడా పనిచేశారు. ‘మండుతున్న తరం’, ‘యుగస్వరం’, ‘కాలాన్ని అధిగమించి’, ‘నాలుగు శతాబ్దాల సాక్షిగా నా మహానగరం’, ‘జ్ఞాపకాల కొండ’, ‘ఖండాంతరాల మీదుగా’ తదితర కవితా సంకలనాలతోపాటు హిందీలో పలు కవితలు రాశారు. తన జైలు జ్ఞాపకాలను ‘గోడల వెనుక’ పేరుతో అక్షరీకరించారు. ‘‘బడి కంటే గుడికి అధిక ప్రాధాన్యమిస్తున్న ఛాందస భావాల్ని విమర్శిస్తూ రాసిన కవితలూ ‘అగ్నిశ్వాస’లో ఉన్నాయి. ఆలస్యంగానైనా కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వచ్చినందుకు ఆనందంగా ఉంది’’ అని నిఖిలేశ్వర్‌ ‘ఆంధ్రజ్యోతి’తో అన్నారు.