భాషాభిమానులపై ప్రభుత్వం ఎదురుదాడి: సీపీఐ రామకృష్ణ

కొలకలూరి ఇనాక్‌కు ‘బొల్లిముంత’ పురస్కారం ప్రదానం

తెనాలి అర్బన్‌, నవంబరు 27: తెలుగుజాతిని చైతన్యం చేసే కళలు ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభావితం చూపిస్తాయని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ అన్నారు. సుప్రసిద్ధ అభ్యుదయ సినీ రచయిత బొల్లిముంత శివరామకృష్ణ శత జయంతి సభను బుధవారం గుంటూరు జిల్లా తెనాలిలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ఆచార్య కొలకలూరి ఇనాక్‌కు బొల్లిముంత శివరామకృష్ణ పురస్కారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కె.రామకృష్ణ మాట్లాడుతూ ‘రాష్ట్రంలో తెలుగుభాష అంతరించే దశకు చేరుకోబోతోంది. ఇకపై కళలు, సాహిత్యం, సభలు చూసే అవకాశం ఉండదు. సత్కారాలు చేసే పని అంతకన్నా రాదు. తెలుగుభాష చదివితేనే కదా సాహిత్యంలో మాధుర్యం తెలిసేది. తెలుగుభాషపై భాషాభిమానులు ఏమి మాట్లాడినా రాష్ట్రప్రభుత్వం ఎదురుదాడికి దిగుతోంది. ఇది మంచి పద్ధతి కాదు.

ప్రాచీన కాలం నుంచి వచ్చిన ఒక భాషపై నిర్ణయం తీసుకునేటప్పుడు సుదీర్ఘ చర్చ జరిపిన తర్వాతే ముందడుగు వేస్తే బాగుండేది.ఇటువంటి ఏకపక్ష నిర్ణయం, మొండివైఖరి రాష్ట్రానికి శ్రేయస్కరం కాదు. రాజకీయ కోణాలు చూశారో... మరేమి ఆలోచించారోకాని కోట్ల మంది అభిమానించే భాషపై గొడ్డలిపెట్టడం బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిది’ అన్నారు. జాతి ఔన్నత్యాన్ని, భాష గొప్పతనాన్ని ఇనాక్‌ రచనల్లో పొందుపరిచారని అభినందించారు. స్వయంకృషితో ఎదిగిన ఆయన తెలుగు సాహిత్యంలో అందరూ మెచ్చే రచనలు స్పృశించారని చెప్పారు. ఆదర్శం కోసం సాహిత్యాన్ని సృష్టించిన బొల్లిముంత జనం కోసం పని చేశారని, ధనం కోసం కాదని నిరూపించారని, ఆయన అన్ని తరాలకు ఆదర్శమేనన్నారు.