వేదిక హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియం

హైదరాబాద్‌ సిటీ, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): పుస్తక ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసే పుస్తక మహోత్సవం మరో పది రోజుల్లో మొదలవనుంది. దేశంలోనే నాలుగో అతిపెద్ద పుస్తక ప్రదర్శనగా ఖ్యాతికెక్కిన హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌ ఈ నెల 23 నుంచి పది రోజుల పాటూ అలరించనుందని సొసైటీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ తెలిపారు. హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో నిర్వహించే పుస్తక ప్రదర్శనలో ఈ ఏడాది 320 స్టాళ్లు, వాటిలో 160 వరకు అంగళ్లు కొలువుదీరనున్నట్లు చెప్పారు. రెండు లక్షల ఉచిత ప్రవేశ పాసులను పంపిణీ చేస్తున్నట్లు సొసైటీ కార్యదర్శి కోయ చంద్రమోహన్‌, వ్యవస్థాపక అధ్యక్షుడు రాజేశ్వరరావు తెలిపారు. విద్యార్థులకు ప్రవేశం ఉచితమని ప్రకటించారు. పుస్తక మహోత్సవం ప్రాంగణానికి పీవీ నరసింహారావు పేరు పెట్టనున్నట్లు సమాచారం.